Site icon HashtagU Telugu

NDA Government Formation : ‘ఇక్కడ కూర్చుంది పవన్ కాదు.. తుఫాన్’ – మోడీ

Pawan Modi Nda

Pawan Modi Nda

కేంద్రంలో మరోసారి విజయడంఖా మోగించిన బిజెపి (BJP)..ఈరోజు ఢిల్లీలో ఎన్డీయే 3.0 కూటమి సమావేశం ఏర్పాటు చేసింది. పాత పార్లమెంటు భవనంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి NDA కూటమి నేతలంతా హాజరయ్యారు. ఈ సందర్బంగా మోడీ (Modi) మాట్లాడుతూ..విజయం సాధించి ఎన్డీయే సమావేశానికి వచ్చిన నేతలకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. మీరు నాకు బాధ్యతలు ఇచ్చారంటే మన మధ్య బంధం చాలా బలంగా ఉందని అర్థం అని మోడీ చెప్పుకొచ్చారు. ఎన్డీయే అధికారంలోకి రావడానికి రాత్రింబవళ్లు శ్రమించిన లక్షలాది మంది కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు.

‘ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయం సాధించలేదు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం, దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం అవసరం. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నా’ అని మోదీ స్పష్టం చేశారు. సౌత్ ఇండియాలో ప్రజలు ఎన్డీఏను అక్కున చేర్చుకున్నారని మోదీ తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకు బాసటగా నిలిచారని పేర్కొన్నారు. ‘తమిళనాడులో సీట్లు గెలవకున్నా ఎన్డీఏ ఓట్ షేర్ భారీగా పెరిగింది. భవిష్యత్తులో అక్కడ మనం కొత్త చరిత్ర రాయబోతున్నాం’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ‘ఇక్కడ కూర్చున్నాడు చూడండి.. ఇతను పవన్ కాదు, తుఫాన్’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతిచ్చారని, చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నామని వివరించారు.

ఇక ఈ సమావేశంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని మోడీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్,చంద్రబాబు నాయుడు, హేమమాలిని, కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలువురు నేతలు భేటీలో ఉన్నారు. సభ ప్రారంభానికి ముందు జేపీ నడ్డా.. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, చంద్రబాబు సహా పలువురు నేతలకు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు.

Read Also : Ravela Kishore Babu : వైసీపీలో మొదలైన రాజీనామాలు..రావెల గుడ్ బై