Site icon HashtagU Telugu

Swachh Bharat Mission 2.0: మిషన్ భారత్ 2.0 లక్ష్యం ఇదే.. స్వచ్ఛ నగరాలుగా మార్చడమే ధ్యేయం: ప్రధాని మోడీ

PM Narendra Modi నగరాలను చెత్త రహితంగా మార్చడమే స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొ్నారు. న‌గ‌రాల‌న్నింటిలో నీటి సంరక్షణ కోసం చర్యలు చేపట్టినట్లు మోడీ పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (SBM-U) 2.0, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (AMRUT) 2.0 పథకాలకు శుక్రవారం ప్రధాని మోడీ శ్రీకారంచుట్టారు. న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడారు. స్వచ్ఛభార‌త్ మిష‌న్ అర్భన్ 2.0, అమృత్ 2.0 కార్యక్రమాలతో పట్టణీకరణ వేగవంతమవుతుందని తెలిపారు. న‌గ‌రాల‌ను చెత్త ర‌హితంగా మార్చడమే స్వచ్ఛభారత్ మిష‌న్ 2.0 లక్ష్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రెండ‌వ ద‌శ‌తో సీవేజ్ మేనేజ్మెంట్‌పై కూడా దృష్టి సారించామని.. న‌గ‌రాల‌న్నింటిలో నీటి భద్రతా చర్యలు కూడా చేప‌డుతామ‌ని తెలిపారు. దీనిలో భాగంగా బుర‌ద నీరు చెరువుల్లో చేర‌కుండా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేయడం, సేఫ్టిక్ ట్యాంకులను నిర్మించడం లాంటివి చేపట్టనున్నట్లు తెలిపారు.

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశ‌యాల‌ను అందుకోవ‌డంలో స్వచ్ఛభారత్ మిష‌న్ 2.0 కీల‌కంగా నిలుస్తుంద‌ని ప్రధాని వ్యాఖ్యానించారు. ప్రట్టణాభివృద్ధితో సమానత్వం సాధ్యమని.. దానికోసం ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్భన్ లో భాగంగా న‌గ‌రాల్లో ఉన్న చెత్తను ప్రాసెస్ చేసి తొలగించనున్నట్లు ప్రధాని తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఓ గార్బేజ్ ప్రదేశాన్ని మొదటగా శుభ్రం చేయనున్నట్లు మోడీ తెలిపారు. ప్రతిరోజూ దేశంలో ల‌క్ష ట‌న్నుల చెత్తను ప్రాసెసింగ్ చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. 2014లో స్వచ్ఛభార‌త్ మొద‌లు పెట్టిన స‌మ‌యంలో కేవ‌లం 20 శాతం మాత్రమే చెత్తను శుద్ధి చేసేవార‌ని, ఇప్పుడు 70 శాతం చెత్తను శుద్ధి చేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు.

2014లో భారతదేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దేశంగా మార్చేందుకు దేశప్రజలు నడుంబిగించారని తెలిపారు. అప్పటినుంచి 10 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణంతో ఓడీఎఫ్ కల నెరవేరినట్లు తెలిపారు. ఇప్పుడు ‘స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0’ లక్ష్యం చెత్త రహిత నగరాలుగా మార్చడమని.. ఈ నినాదాన్ని కూడా సంకల్పం చేయాలని ప్రధాని కోరారు. స్వచ్ఛ భారత్ అభియాన్, అమృత్ మిషన్ దేశానికీ గర్వకారణంగా నిలిచాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతోపాటు హౌసింగ్ అండ్ అర్బన్ వ్యవహారాల సహాయ మంత్రి, అధికారులు హాజరయ్యారు. స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (SBM-U) 2.0, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (AMRUT) 2.0 పథకాలను నగరాలన్నింటినీ చెత్త రహితంగా.. నీటి భద్రతగా మార్చాలనే ఉద్దేశ్యంతో రూపొందించారు. 2030 నాటికి దేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ పథకాలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. వీటికోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులను కేటాయించింది.