కేంద్రం , అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అనేక పథకాలు అందుబాటులోకి తీసుకొచ్చి వారి పోత్సహిస్తున్నారు. తాజాగా కేంద్రం సరికొత్త పథకాన్ని ఈరోజు ప్రవేశ పెట్టింది. ఆ పథకం పేరు “బీమా సఖి” (Bima Sakhi Yojana). ఈ పథకం కింద, గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi) హరియాణాలోని పానిపత్‌లో డిసెంబర్ 9, 2024న “బీమా సఖి యోజన”ను ప్రారంభించారు. ఈ పథకం ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళల ఉపాధిని మెరుగుపర్చేందుకు ఉద్దేశించబడింది. బీమా రంగంలో మహిళల పాత్రను పెంపొందించేందుకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించబడుతోంది. బీమా సఖి పథకంలో భాగంగా.. మహిళలకు బీమా సంబంధిత పనులపై శిక్షణ ఇవ్వబడుతుంది. “లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా” (LIC) బీమా సఖిగా నియమితులయ్యే మహిళలు గ్రామాల్లో ప్రజలకు బీమా చేయడం ద్వారా తమ స్వంత ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ పథకం గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబనను కల్పించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది.
ఈ పథకంలో చేరిన బీమా సఖులకు తొలి సంవత్సరం ప్రతి నెలా రూ. 7,000 ఇవ్వబడుతుంది. రెండో సంవత్సరం ఇది రూ. 6,000కు, మూడో సంవత్సరం రూ. 5,000కు తగ్గుతుంది. అదనంగా, బీమా లక్ష్యాలను చేరుకున్న వారికి ప్రత్యేక కమీషన్ కూడా అందుతుంది. మొత్తం మీద, ఈ పథకం ద్వారా మహిళలు ఉపాధి అవకాశాలను పొందే అవకాశం ఉంది. ప్రారంభ దశలో 35,000 మంది మహిళలకు ఈ పథకం ప్రయోజనం కల్పించబడుతుంది. తరువాత 50,000 మందికి విస్తరించబడుతుంది. మూడు సంవత్సరాల వ్యవధిలో మొత్తం 2 లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఈ విధానం గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతకు కొత్త దారులు తెరుస్తుంది.
బీమా సఖి పథకంలో చేరాలనుకునే మహిళల వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించబడింది. మరిన్ని వివరాలకు సమీపంలోని LIC కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా www.licindia.in ను సందర్శించవచ్చు.
Read Also : Telangana Assembly : ఈ నెల 16 కు వాయిదా పడ్డ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు