Two Vande Bharat trains to Telugu states: ప్రధాని మోడీ సోమవారం దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇది విశాఖపట్నం నుంచి ప్రయాణించే నాలుగోది. రాయ్‌పుర్-విజయనగరం మార్గంలో ఇది మొదటిది. దీంతో పాటు నాగ్‌పుర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా మోడీ ప్రారంభించారు. నాగ్‌పుర్‌లో బయల్దేరే ఈ రైలు సికింద్రాబాద్ స్టేషన్‌కు రాత్రి 10.45 గంటలకు చేరకుంటుంది.
ఈ నెల 20 నుంచి ఈ రైలు అందుబాటులోకి..
సికింద్రాబాద్-నాగ్‌పుర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. దుర్గ్-విశాఖపట్నం (20829) వందే భారత్.. దుర్గ్ నుంచి వారానికి 6 రోజులు(గురువారాలు మినహా) 05.45 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 13.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-దుర్గ్ (20830) వందే భారత్ విశాఖపట్నం నుంచి వారానికి 6 రోజులు (గురువారాలు మినహా) 14.50 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 22.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుంది. ఈ నెల 20 నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరగనుంది.
ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయి..
వందేభారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు తన ప్రవర్తించిన తీరును గుర్తు చేసుకున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయన్నారు. అయితే, ప్రతిపక్షాల అవమానాలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ‘మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లో ప్రతిపక్షాలు నన్ను అనేకసార్లు ఎగతాళి చేశాయి. ఎంతో అవమానించాయి. అయితే.. ప్రతిపక్షాల అవమానాలకు స్పందించకూడదని నిర్ణయించుకున్నా. 100 రోజుల ప్రభుత్వ ప్రణాళికను పూర్తి చేయడంపైనే దృష్టి సారించా” అని తెలిపారు.
ఈ శతాబ్దం మన దేశానికి బంగారు కాలం..
”దేశాభివృద్ధి కోసం ఎలాంటి అవకాశం వదులుకోలేదు. విదేశాల్లోనూ మన అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరిగాయి. ఈ వంద రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చాం. వేగంగా ఆ పనులు చేపడతాం. గ్రామ, పట్టణ ప్రజల జీవనాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నాం” అని మోడీ పేర్కొన్నారు. ఒకవైపు దేశంలోని ప్రతి పౌరుడు ప్రపంచంలో భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్ కావాలని కోరుకుంటుంటే.. మరోవైపు కొంతమంది మాత్రం తప్పుడు పనులు చేస్తూ.. దేశ సమైక్యతపై దాడి చేస్తున్నారని విమర్శించారు. ఈ శతాబ్దం మన దేశానికి బంగారు కాలమని.. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు.