PM Modi: సెప్టెంబర్ 14న అస్సాం పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రూ.19 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు 140 కోట్ల మంది ప్రజలే రిమోట్ కంట్రోల్ అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ తనపై చేసే విమర్శలపై స్పందిస్తూ “నన్ను మీరు ఎన్ని తిట్లు తిట్టినా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను శివ భక్తుడిని. విషమంతా మింగేస్తాను. కానీ వేరేవారిని అవమానిస్తే మాత్రం నేను సహించలేను” అని అన్నారు.
భూపేన్ హజారికాకు భారతరత్నపై ప్రధాని వ్యాఖ్యలు
ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగారు. “భూపేన్ దాకు భారతరత్న ఇవ్వాలనే నా నిర్ణయం సరైనదేనా? కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానించడం సరైనదేనా?” అని ప్రశ్నించారు. ఇది ప్రజల మనసుల్లో ఉన్న భావాలను వెలికితీయడానికి చేసిన ప్రయత్నంగా భావించవచ్చు.
Also Read: Vahanamitra: వాహనమిత్రకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు??
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రధాని ప్రస్తావన
“ఆపరేషన్ సిందూర్ తర్వాత నా అస్సాం పర్యటన ఇదే మొదటిది. మా కామాఖ్య ఆశీర్వాదంతో ఆపరేషన్ సిందూర్ ఒక గొప్ప విజయంగా నిలిచింది. మా కామాఖ్య పవిత్ర భూమికి రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు ఇక్కడ జన్మాష్టమి వేడుకలు జరుపుకోవడం ఇంకా ఆనందాన్ని ఇస్తోంది” అని ప్రధాని అన్నారు. ఎర్రకోట నుంచి తాను ప్రసంగించినప్పుడు ‘చక్రధారి మోహన్’, ‘శ్రీకృష్ణుడు’ గుర్తుకు వచ్చారని, అందుకే భవిష్యత్ భద్రతా విధానంలో ‘సుదర్శన చక్రం’ ఆలోచనను ప్రజల ముందు ఉంచానని తెలిపారు.
నెహ్రూ కాలం నాటి గాయాలు ఇంకా మానలేదు
అస్సాంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వీడియోను చూపించారని, అది చూసి తాను చాలా బాధపడ్డానని అన్నారు. “మన దేశ గొప్ప బిడ్డ, అస్సాం గౌరవం భూపేన్ హజారికాకు భారతరత్న ఇచ్చిన రోజున, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ‘మోదీ డాన్స్, పాటలు పాడే వారికి భారతరత్న ఇస్తున్నాడు’ అని వ్యాఖ్యానించారు” అని ప్రధాని పేర్కొన్నారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధం తర్వాత పండిట్ నెహ్రూ చేసిన వ్యాఖ్యలు ఈశాన్య ప్రాంత ప్రజల గాయాలను ఇంకా మాన్పలేదని ఆయన అన్నారు.