Site icon HashtagU Telugu

PM Modi : ఎర్ర‌కోట‌పై త్రివ‌ర్ణ‌పతాకాన్ని ఎగుర‌వేసిన మోడీ

Modi Flag

Modi Flag

స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. అమరవీరుల త్యాగాలను కొనియాడారు. బానిస సంకెళ్ల నుంచి దేశానికి స్వేచ్ఛను అందించేందుకు వారు చేసిన పోరాటం అనుపమానమన్నారు. మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి వారు మనకు మార్గదర్శకులన్నారు. మహనీయుల తిరుగుబాట్లే మనకు స్ఫూర్తి అన్న ప్రధాని.. దేశం కోసం ఎంతోమంది స్వాతంత్య్ర‌ సమరయోధులు తమ ప్రాణాలను త్యజించారన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారత స్వాతంత్య్ర‌ దినోత్సవం జరుగుతోందని, ఈ అమృత మహోత్సవం వేళ భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ఈ వేళ మనకు త్యాగధనుల బలిదానాలను స్మరించుకునే అదృష్టం కలిగిందన్నారు. మన ముందున్న మార్గం కఠినంగా ఉందని, లక్ష్యాల సాధన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ 75 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్టు పేర్కొన్నారు. బానిసత్వంలో భారతీయత అనే భావన గాయపడిందని, ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ దేశం నిలిచి గెలిచిందన్నారు. స్వచ్ఛ భారత్, ఇంటింటికి విద్యుత్ సాధన అంత తేలికైన విషయం కాకున్నా లక్ష్యాలను వేగంగా చేరుకునేలా దేశం ముందడుగు వేస్తోందన్నారు.

యువత స్టార్టప్‌లతో ముందుకొస్తోందన్నారు. మూలాలు బలంగా ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగగలమని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో భాగమేనని మోదీ వివరించారు. మహాత్ముని ఆశయాలకు, భారతీయులందరి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాలు ప్రజల ఆశలను సాకారం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. దేశం నలుమూలలా అభివృద్ధి కాంక్ష రగిలిపోతోందన్నారు. వచ్చే 25 ఏళ్ల అమృతకాలం మనకు ఎంతో ప్రధానమైనదని మోదీ పేర్కొన్నారు. బానిస మనస్తత్వాన్ని తుదముట్టించి, సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలని మోదీ ఆకాంక్షించారు.

Exit mobile version