పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (Parliament Monsoon Session) ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాలను “విజయాల పండుగ”గా అభివర్ణించిన ఆయన, దేశ భద్రత, ఆర్థిక అభివృద్ధి వంటి అంశాల్లో సాధించిన మైలురాళ్లను ప్రస్తావించారు. ముఖ్యంగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి స్పందనగా చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) విజయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది భారత భద్రతా బలగాల సాహసానికి ప్రతీక అని అభివర్ణించారు.
భారత సైన్యం కేవలం 22 నిమిషాల్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం అనేది అత్యంత వేగవంతమైన, వ్యూహాత్మక విజయం. “ఆపరేషన్ సిందూర్”తో భారత్ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక ఇచ్చిందని పేర్కొన్నారు. గతంలో వామపక్ష తీవ్రవాదంతో ఇబ్బందిపడిన ప్రాంతాల్లో నక్సలిజం తగ్గుముఖం పట్టిందని, ఇది భద్రతా దళాల సమన్వయంతో సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ రక్షణ వ్యవస్థ బలంగా ఉండటమే అభివృద్ధికి పునాది అవుతుందని మోదీ అన్నారు.
Parliament : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అసత్య ప్రచారం..పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు వివరణ
ఆర్థిక ప్రగతిపై మాట్లాడిన ప్రధాని, 2014లో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టే సమయంలో ద్రవ్యోల్బణం రెండంకెలలో ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం అది 2 శాతం వరకు తగ్గినదని, దీనివల్ల సామాన్య ప్రజల జీవితాల్లో ఉపశమనం వచ్చిందని తెలిపారు. 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటపడేలా చేసిన కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించాయని చెప్పారు. ఈ విజయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే వేదికగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉపయోగపడాలని ప్రధాని ఆకాంక్షించారు.
అయితే, ఈ సమావేశాల్లో విపక్షాలు కూడా ఉగ్రదాడిపై ప్రశ్నలు వేస్తున్నాయి. మూడు నెలలు అయినా పహల్గాం ఉగ్రదాడి నిందితులను పట్టుకోలేకపోయారని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. పాక్, భారత్ మధ్య యుద్ధానికి విరామం తన విజయమని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరగాలన్నది విపక్షాల డిమాండ్. ప్రధాని మోదీ పార్లమెంట్‌లో దీనిపై సమాధానం ఇవ్వాలని విపక్ష నేతలు అంచనా వేస్తున్నారు. అటు భద్రత, ఇటు ఆర్థిక రంగాల్లో విజయం సాధించిన భారత ప్రభుత్వం ఈ సమావేశాల వేదికగా దేశానికి మరిన్ని స్పష్టతలు ఇవ్వవచ్చని భావిస్తున్నారు.