PM On Netaji: నేతాజీ పథంలో భారత్‌ నడిచి ఉంటే.. మరింత అభివృద్ధి చెంది ఉండేది: మోడీ

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.

  • Written By:
  • Updated On - September 9, 2022 / 12:41 PM IST

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. విజయ్‌ చౌక్‌ నుంచి ఇండియా గేట్‌వరకు సెంట్రల్‌విస్టా అవెన్యూ ప్రారంభోత్సవానికి ముందు.. ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేసిన ప్రధాని.. కర్తవ్యపథ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్‌ నేతాజీ పథంలో నడిచి ఉంటే మరింత అభివృద్ధి చెంది ఉండేదన్నారు. దురదృష్టవశాత్తు స్వాతంత్ర్యం తర్వాత నేతాజీని ప్రభుత్వాలు మరిచాయన్నారు. ” గత ఎనిమిదేళ్లలో నేతాజీ ఆశయాలు, కలలు సాధన దిశగా మేం అనేక నిర్ణయాలు తీసుకున్నాం.

Also Read:   TBJP@10: టీబీజేపీ టార్గెట్ 10.. ఆ సీట్లపైనే గురి!

మార్పు అనేది కేవలం చిహ్నాలకే పరిమితం కాకుండా ఇప్పుడు విధానాల్లో భాగమైంది” అని మోడీ వ్యాఖ్యానించారు. “ఈ చరిత్రాత్మక కార్యక్రమానికి దేశ ప్రజలంతా సాక్షిగా నిలిచారు. దేశానికి ఇవాళ కొత్త ప్రేరణ దొరికింది. గత స్మృతులను వదిలి కొత్త చరిత్ర సృష్టిస్తున్నాం. దిల్లీ రాజ్‌పథ్‌ ఇకపై చరిత్రగా మిగిలిపోనుంది. కర్తవ్యపథ్‌ రూపంలో కొత్త చరిత్ర లిఖిస్తున్నాం. అమృతోత్సవ వేళ ఇండియా గేటు వద్ద నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించాం. ’’ అని చెప్పారు.  కాలం చెల్లిన చట్టాల రద్దుతో సహా కేంద్రం తీసుకున్న పలు నిర్ణయాలను
ఈసందర్భంగా ప్రధాని ఉటంకించారు.  కర్తవ్య పథ్‌ అభివృద్ధిలో భాగస్వాములైన కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఖమ్మం జిల్లా గ్రానైట్‌తో..

నేతాజీ సేవలను తరతరాలకు చాటేందుకు ఇండియా గేట్‌ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహానికి ఖమ్మం జిల్లా గ్రానైట్‌ వినియోగించారు. ప్రఖ్యాత కళాకారుడు అరుణ్ యోగిరాజ్‌ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని రూపకల్పన చేశారు. దేశంలోనే ఎత్తయిన ఏకశిలా విగ్రహాల సరసన నేతాజీ విగ్రహం చేరింది.

Also Read:   Bandi Sanjay : టీఆర్ఎస్ నేతలు గొర్రెలతో సమానం.. గవర్నర్ ప్రొటోకాల్ విషయంలో బండి ఆగ్రహం..!!

రాజ్‌పథ్‌ ఇక కర్తవ్యపథ్‌..

ఢిల్లీలోని కీలక ప్రాంతమైన రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్‌గా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మౌలిక సదుపాయాల పరంగా రాజ్‌పథ్‌లో అనేక మార్పులు చేశారు. ప్రజాసాధికారతకు చిహ్నంగా నిలిచే ఈ కర్తవ్యపథ్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇండియా గేట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ఉండే రాజ్‌పథ్‌ను  వలసవాద విధానాలు, చిహ్నాల మార్పే లక్ష్యంగా  కర్తవ్యపథ్‌గా నామకరణం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కర్తవ్యపథ్‌లో ఆహార స్టాళ్లు, వాక్‌వేలు, హరిత వనాలు, దారిపొడువునా 16 వంతెనలు, రెండుచోట్ల బోటింగ్‌, 1125 వాహనాలు పార్కింగ్‌ చేసేలా అవకాశం ఉండనుంది. అలాగే, విక్రయశాలలు, పార్కింగ్ ప్రదేశాల్లో 24గంటల పాటు భద్రత ఉండనుంది.