Site icon HashtagU Telugu

PM Modi : శివ తాండవ స్తోత్రం, బ్రెజిల్ సాంబా సంగీతంతో ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం

PM Modi given an unprecedented welcome with Shiva Tandava Stotram and Brazilian Samba music

PM Modi given an unprecedented welcome with Shiva Tandava Stotram and Brazilian Samba music

PM Modi : బ్రెజిల్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి రాజధాని బ్రసీలియాలో అత్యంత హృద్యంగా స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయాల చైతన్యం మరియు బ్రెజిల్ సాంస్కృతిక రంగుల మేళవింపుతో నిర్వహించబడిన ఓ విభిన్న సాంస్కృతిక కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో శివ తాండవ స్తోత్రానికి నృత్యప్రదర్శన, బ్రెజిలియన్ సాంబా-రెగే సంగీత విన్యాసాలు, అమెజాన్ గీతాల ఆలాపనలు వేదికను రంగరించాయి. ఈ భిన్న కళారూపాల సమ్మేళనం, రెండు దేశాల మధ్య గాఢ సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబించింది.

Read Also: Revanth Reddy vs KTR : ఎవరొస్తారో రండి తేల్చుకుందాం!..సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సవాల్

ఈ వేడుకను తన జీవితంలోని ఒక అద్భుత ఘట్టంగా అభివర్ణించిన ప్రముఖ వేదాంతాచార్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జోనాస్ మసెట్టి మాట్లాడుతూ..ఇది మాకొక దివ్యానుభూతి. వేదాంతం మా లోకదృష్టిని మార్చింది. ఇది మన వ్యక్తిగత జీవితాలనే కాదు, మా సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తోంది అన్నారు. భారత్‌ పట్ల తన కృతజ్ఞతను ఇలా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్రెజిల్‌కి చెందిన యోగా అధ్యాపకురాలు కెన్లిన్ మాట్లాడుతూ..మోడీ గారి సాన్నిధ్యం మాకు ఉత్సాహాన్ని, శక్తిని కలిగించింది. ఆయన నుంచి కారుణ్యం ఎలా వెలియబడుతుందో ప్రత్యక్షంగా చూశాం అని పేర్కొన్నారు.

ప్రత్యేక కార్యక్రమాన్ని సమన్వయించిన ఐసీసీఆర్ డైరెక్టర్ జ్యోతి కిరణ్ శుక్లా మాట్లాడుతూ..ఇది భారతీయ సమాజానికి, ఇక్కడి ప్రవాస భారతీయులకు ఒక అద్భుతమైన సంస్కృతిక బహుమతి. వేద మంత్రాలు మరియు అమెజాన్ జానపద గీతాల మధ్య ఉన్న మౌలిక అనుసంధానాలపై మా వివేకానంద కేంద్రంలో పరిశోధనలు జరుగుతున్నాయి అని వెల్లడించారు. దాదాపు పదేళ్లుగా వేదాంతం అభ్యసిస్తున్న ఓ బ్రెజిలియన్ కళాకారుడు మాట్లాడుతూ మా గురువు సమక్షంలో, భారత ప్రధాని ఎదుట మంత్రాలను ఉచ్ఛరించడం నాకు ఎంతో గర్వకారణం. ఇది నా జీవితంలో మరపురాని ఘట్టం అని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ వేడుకపై ప్రధాని మోడీ స్వయంగా స్పందిస్తూ, ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ చేశారు. బ్రెజిల్‌లో భారతీయ మూలాల పట్ల ఉన్న గాఢమైన అనుబంధాన్ని ఈ అద్భుత స్వాగతం స్పష్టంగా చూపించింది. ఇది నన్ను ఎంతో భావోద్వేగానికి గురిచేసింది అని పేర్కొన్నారు. 17వ బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం రియోడి జెనీరో నుంచి బ్రసీలియాకు చేరుకున్న ప్రధాని మోడీకి బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ ముసియో మాంటెరో ఫిల్హో విమానాశ్రయంలో ఆత్మీయంగా స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వాతో భేటీ అవుతారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడులపై చర్చలు జరగనున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఈ పర్యటన ద్వారా కనిపిస్తున్నాయి.

Read Also: Vijayawada : ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు