Rajkot Fire Tragedy: రాజ్‌కోట్ అగ్నిప్రమాదంపై మోడీ దిగ్బ్రాంతి, మృతుల కుటుంబాలకు 4 లక్షలు

గుజరాత్‌లో టీఆర్‌పీ గేమింగ్ జోన్‌ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ లో పోస్ట్ చేస్తూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు

Rajkot Fire Tragedy: గుజరాత్‌లో టీఆర్‌పీ గేమింగ్ జోన్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చిన్నారులు సహా 24 మంద మరణించారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని చెబుతున్నారు. కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ లో పోస్ట్ చేస్తూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కూడా మోడీ మాట్లాడి సహాయ, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ ప్రధాని మోడీ సానుభూతి తెలిపారు.

శనివారం కావడంతో టీఆర్‌పీ గేమింగ్ కొరకు పెద్దలతో పాటు పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఫైబర్‌తో చేసిన గేమింగ్ జోన్ కావడంతో చెలరేగిన మంటలు ఒక్కసారిగా చుట్టూరా వ్యాప్తి చెందాయి. ఇనుప నిర్మాణంపై గేమింగ్ జోన్‌ను నిర్మించడం వల్ల అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లలో సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రమాదం అనంతరం గేమింగ్ జోన్ నిర్వాహకుడు యువరాజ్, 30 నుంచి 40 మంది జోన్ ఉద్యోగులు పరారయ్యారు.

మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. తప్పిపోయిన వారి గురించిన సమాచారం సేకరించేందుకు వీలుగా వారి పిల్లలు, బంధువుల సమాచారాన్ని తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నామని పోలీసు కమిషనర్ రాజు భార్గవ తెలిపారు. 15 మంది చిన్నారులను సురక్షితంగా కాపాడారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను సివిల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం తీసుకున్న తర్వాత, రాజ్‌కోట్‌లోని అన్ని గేమింగ్ జోన్ హాళ్లను మూసివేయాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదేశాలు ఇచ్చారు. నగరంలోని అన్ని గేమింగ్ జోన్‌లలో భద్రతా తనిఖీ చేసిన తర్వాతే అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. గేమింగ్ జోన్ ప్లాట్ యువరాజ్ సింగ్ జడేజా అనే వ్యక్తి పేరు మీద ఉంది. కానీ గేమింగ్ జోన్‌ను ఎవరు నడుపుతున్నారో స్పష్టంగా లేదు.

Also Read: KKR vs SRH: ఐపీఎల్ 2024 విజేత హైద‌రాబాదే.. జోస్యం చెప్పిన ప్ర‌ముఖ ఆట‌గాడు..!