ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి ఇచ్చిన ఆగస్టు 15 ప్రసంగంలో ఒక ముఖ్యమైన మార్పు జరిగింది.. అదేంటో మీరు గుర్తు పట్టారా? ఈసారి మోడీ తన ప్రసంగం కోసం టెలి ప్రాంప్టర్ పై ఆధారపడలేదు. పేపర్ లో రాసుకున్న నోట్స్ ను చూస్తూ దాదాపు 83 నిమిషాల పాటు ఏకధాటిగా మోడీ ప్రసంగించారు. రాబోయే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలపడం, స్వతంత్ర సమర యోధుల త్యాగాలు, కొవిడ్ పై యుద్ధం, స్టార్టప్ బూమ్ అనే టాపిక్స్ కేంద్ర బిందువులుగా ప్రధాని ప్రసంగం సాగింది.
టెలి ప్రాంప్టర్ ను ఎందుకు పక్కన పెట్టారు?
టెలి ప్రాంప్టర్ ను మోడీ ఎందుకు పక్కన పెట్టారు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే.. ఒకసారి గత జనవరి నెలకు వెళ్ళాలి. టెలి ప్రాంప్టర్ ను చూస్తూ మోడీ ప్రసంగిస్తుండగా.. సాంకేతిక లోపం చోటుచేసుకుంది. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. దీంతో అప్పట్లో విపక్షాలు మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టాయి.
టెలి ప్రాంప్టర్ లేనిదే మోడీ ప్రసంగించలేరంటూ వ్యాఖ్యలు చేశాయి. “ప్రధాని మోదీ మాట్లాడే అబద్ధాలను వినివిని ఆయన వాడే
టెలి ప్రాంప్టర్ కూడా మూగ బోతోంది” అని అప్పట్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్స్ వేశారు.
టెలి ప్రాంప్టర్ అంటే?
టెలి ప్రాంప్టర్ .. అనేది న్యూస్ ఛానళ్లలో నిత్యం వినియోగంలో ఉంటుంది. న్యూస్ రీడర్స్.. టెలి ప్రాంప్టర్ ను చూస్తూ న్యూస్ చదువుతారు. టెలి ప్రాంప్టర్ లో వార్తలోని వాక్యాలు ఒకదాని తర్వాత ఒకటిగా క్యూలో వస్తుంటాయి. న్యూస్ రీడర్ వార్త చదివే స్పీడ్ కు అనుగుణంగా .. టెలి ప్రాంప్టర్ లో వార్త స్క్రిప్ట్ ను రన్ చేసేందుకు ఒక వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ లో పని చేస్తుంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ టెలి ప్రాంప్టర్ తో ప్రసంగం ఇచ్చేటప్పుడు కూడా ఈ వ్యవహారమంతా జరిగేది. ప్రధాని మోదీ నిలబడి మాట్లాడే ప్లేస్ కు సరిగ్గా ముందు వర్చువల్ టెలి ప్రాంప్టర్ ను ఏర్పాటు చేసేవారు. దాన్ని కేవలం ఆపరేటర్, ప్రసంగించే వ్యక్తి మాత్రమే చూడగలరు.