PM Modi Diwali Celebrations : ప్రధాని మోడీ ప్రతి సంవత్సరం జవాన్లతో కలిసి దీపావళి వేడుకుల చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని ఈరోజు అక్కడి కచ్ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం జవాన్లతో దీపావళి వేడుకులు చేసుకున్నారు. సైనిక దుస్తుల్లో వచ్చిన మోడీ.. భద్రతా సిబ్బందికి మిఠాయిలు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా, 2014లో అధికారంలోకి వచ్చినప్పటినుంచి మోడీ ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. దళాలతో ముచ్చటించి.. వారికి స్వీట్లు తినిపించి సరదాగా గడుపుతూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. 2014లో మోడీ తొలిసారి సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2022లో కార్గిల్‌లో, గతేడాది చైనా సరిహద్దులోని లేప్చా (హిమాచల్‌ప్రదేశ్) సైనిక శిబిరంలో వేడుకలు చేసుకున్నారు. ఇకపోతే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో ప్రధాని నరేంద్ర మోడీ దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పవిత్ర దీపాల పండుగ సందర్భంగా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషంగా, సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ మాత, శ్రీ గణేషుని అనుగ్రహంతో ఆశీర్వదించబడాలని రాసుకొచ్చారు.
మరోవైపు దీపావళి పండుగ వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేడు అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ చేరుకోనున్నారు. అక్కడ భారత ఆర్మీ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. దీనికి ముందు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బుధవారం సాయంత్రం అస్సాంలోని తేజ్‌పూర్ చేరుకున్నారు. ఇక్కడ అతను మేఘనా స్టేడియంలో సైనిక సిబ్బందితో దీపావళిని జరుపుకున్నాడు. ఆ తర్వాత వారితో కలిసి డిన్నర్ కూడా చేశాడు.