PM Modi : ఓటు వేసిన ప్రధాని మోడీ.. దేశ ప్రజలకు కీలక సందేశం

PM Modi : మూడోవిడత ఎన్నికల ఘట్టం మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.

  • Written By:
  • Updated On - May 7, 2024 / 08:40 AM IST

PM Modi : మూడోవిడత ఎన్నికల ఘట్టం మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్‌లో ఓటు వేశారు. ఇవాళ ఉదయం 7:30 గంటలకు గాంధీనగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఈసందర్భంగా ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇవాళ ప్రజలంతా రికార్డు సంఖ్యలో ఓట్లు వేయాలి’’ అని పిలుపునిచ్చారు. ప్రజల చురుకైన భాగస్వామ్యం ఖచ్చితంగా ఎన్నికలను మరింత చైతన్యవంతం చేస్తుందన్నారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఓటుకు విశేష ప్రాధాన్యం ఉంది. దేశ ప్రజలంతా పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలి. అధిక ఓటింగ్‌తో రికార్డ్ సృష్టించాలి. ఎండల్లో కూడా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల వేళ ప్రజలు తమ ఆరోగ్యంపైనా దృష్టి పెట్టాలి. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగితే ఆరోగ్యం బాగుంటుంది’’ అని ప్రధాని మోడీ సూచించారు. ‘‘ఎన్నికల వేళ సమయంతో పోటీ పడుతూ మీడియా పని చేస్తోంది. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఎలక్షన్ కమిషన్‌కు ధన్యవాదాలు’’ అని మోడీ తెలిపారు.  ప్రధాని మోడీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్‌కు రావడంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఇక ఇవాళ ఉదయం 9 గంటలకు అహ్మదాబాద్‌లోని నారన్‌పురా సబ్-జోనల్ కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో అమిత్ షా ఓటు వేయనున్నారు.  కాగా, దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు,  కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మొత్తం 93 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది.

Also Read :Sunita Williams : సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా.. కారణమిదీ..

‘నేషన్-బిల్డింగ్’ కోసం ఓటు వేయండి : అమిత్ షా

గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా ఓటర్లకు కీలక సందేశం ఇచ్చారు.  “దేశ నిర్మాణానికి” సహకరించడానికి ప్రజలు తమ ఓటును తప్పక వేయాలని కోరారు. అవినీతి రహిత, కుల రహిత, రాజవంశ రహిత వ్యవస్థను కోరుకునే వారంతా తప్పక ఓటు వేయాలన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి  బ్లూప్రింట్ కలిగిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఓటర్లను అమిత్ షా కోరారు. ‘‘మీ ఓటు మీకు మాత్రమే కాదు.. రాబోయే దశాబ్దాల పాటు యావత్ జాతి అదృష్టానికి పునాదులు వేస్తుంది” అని అమిత్ షా పేర్కొన్నారు.