Site icon HashtagU Telugu

India-China: అమెరికాకు వార్నింగ్‌.. వచ్చే ఏడాది భారత్‌కు చైనా అధ్య‌క్షుడు!

India-China

India-China

India-China: ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల భేటీ అమెరికాకు ఒక బలమైన సందేశాన్నిచ్చింది. ఇరు దేశాల (India-China) మధ్య సంబంధాలలో ఏ మూడో దేశం జోక్యాన్ని అంగీకరించబోమని వారు స్పష్టం చేశారు. చైనా పర్యటనలో ప్రధాని మోదీ SCO సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు సందర్భంగా మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య దాదాపు 40 నిమిషాల పాటు ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఇరు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఒక ప్రకటన విడుదల చేశాయి. భారత్, చైనా పోటీదారులు కాదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్, చైనాల విధాన వ్యూహాలు స్వయంప్రతిపత్తితో కూడినవని, వాటి సంబంధాలను ఏ మూడో దేశంతో ముడిపెట్టకూడదని ప్రధాని మోదీ అన్నారు.

ఉగ్రవాదంపై కలిసి వచ్చిన ఇద్దరు నేతలు

ఉగ్రవాదంపై పోరాడటానికి ప్రధాని మోదీ, జిన్‌పింగ్ ఇద్దరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఉగ్రవాదంపై చైనా తన వైఖరిని మార్చుకోవడం వల్ల పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం జరగనుంది. ఆపరేషన్ సింధు తర్వాత ఉగ్రవాదం విషయంలో చైనాను భారత్ తన వైపునకు తిప్పుకోవడం ఒక పెద్ద విజయం.

Also Read: Komatireddy Venkat Reddy : కౌంట్‌డౌన్‌ స్టార్ట్.. సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్-చైనాల పాత్ర

టియాంజిన్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడంలో భారత్, చైనా ఆర్థిక వ్యవస్థల పాత్రను గుర్తించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ గుర్తింపు అమెరికాకు ఒక గట్టి ఎదురుదెబ్బగా పరిణమించనుంది. అమెరికా గతంలో చైనా ఉత్పత్తులపై 30 శాతం సుంకం విధించింది. కానీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నందున 90 రోజులు దాన్ని నిలిపివేసింది. అంతకుముందు వాషింగ్టన్, బీజింగ్‌ల మధ్య 245 శాతం వరకు పెరిగిన సుంకాల యుద్ధం మొదలైంది.

వచ్చే ఏడాది భారత్‌కు షీ జిన్‌పింగ్

వచ్చే ఏడాది 2026లో భారత్‌లో BRICS సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని జిన్‌పింగ్ అంగీకరించారు. SCO సదస్సులో చైనా అధ్యక్షతను ప్రధాని మోదీ ప్రశంసించారు.