77th Independence Day: స్వాతంత్య్ర యోధుల త్యాగాలను దేశం మరువదు.. ఎర్రకోటలో ప్రధాని మోడీ ప్రసంగం

యావత్ దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని, అక్కడ శాంతి పరిఢవిల్లేలా చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. 7వ భారత స్వాతంత్య్ర దినోత్సవాల (77th Independence Day) సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.

  • Written By:
  • Updated On - August 15, 2023 / 09:17 AM IST

77th Independence Day: యావత్ దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని, అక్కడ శాంతి పరిఢవిల్లేలా చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. గత కొన్ని రోజులుగా మణిపూర్ లో శాంతి వాతావరణం ఉందని, రానున్న రోజుల్లోనూ అది కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో జరిగిన హింసాకాండలో ఎంతోమంది చనిపోవడం బాధాకరమన్నారు.

77వ భారత స్వాతంత్య్ర దినోత్సవాల (77th Independence Day) సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన, అమరులైన దేశభక్తుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదన్నారు.

జాతిపిత మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమం చారిత్రకమైనదని ఆయన చెప్పారు. ఈ ఏడాది శ్రీ అరవిందో 150వ జయంతి, స్వామి దయానంద్ సరస్వతి 150వ జయంతి, రాణి దుర్గావతి 500వ జయంతి, మీరా భాయ్ 525వ జయంతికి వేదికగా మారనుందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత దేశాన్ని సాకారం చేసే దిశగా అడుగులు పడుతున్న అమృత్ భారత్ కాలంలో ఉండటం మనందరి అదృష్టమన్నారు. ఇప్పుడు దేశం వేస్తున్న ఒక్కో అడుగు వచ్చే 1000 ఏళ్లలో సాకారం కానున్న బంగారు భారతదేశానికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు.

Also Read: 77th Independence Day: పంద్రాగస్టుకు ముస్తాబైన భారత్.. ఎర్రకోటలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

వచ్చే వెయ్యి ఏళ్ల కోసం దేశపు అడుగులు

“ఒక చిన్న ఘటన అయినా వేలాది సంవత్సరాల పాటు దేశముపై ప్రభావాన్ని చూపించగలదు. వేల ఏళ్ల క్రితం జరిగిన ఒక ఘటన వల్ల.. ఒక రాజు ఓడిపోవడం వల్ల మనదేశం ఆనాడు ఇతరుల కబంధ హస్తాల్లోకి వెళ్ళింది. మళ్ళీ మనం ఎంతో పోరాటం చేసి స్వాతంత్ర్యాన్ని సాధించుకోవాల్సి వచ్చింది. భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఇప్పుడు మనం వేస్తున్న ప్రతి అడుగు, తీసుకుంటున్న ప్రతి నిర్ణయం, చేస్తున్న ప్రతి ఆవిష్కరణ వచ్చే వెయ్యి ఏళ్లలో మన దేశం, మన భావి తరాల తలరాతను మారుస్తుంది” అని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశ ప్రజలు ఇచ్చిన నమ్మకంతోనే కొత్త సంస్కరణలు

“దేశం అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమైంది. దేశం అభివృద్ధికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. ఈ అంశాన్ని చాటిచెప్పేందుకే ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా చిరువ్యాపారులు, చేనేత కార్మికులు, రైతులు, కూలీలు, కార్మికులు సహా మరెన్నో వృత్తులు చేసే ప్రజానీకాన్ని పిలిచాం” అని మోడీ చెప్పారు. ఇప్పుడు ప్రపంచంలో “గ్లోబల్ సౌత్” కు దిక్సూచిగా భారత్ ఎదుగుతోందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో, ఆ తర్వాత ఇతర దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోగా.. భారత్ మాత్రం దృఢంగా నిలబడిందని చెప్పారు. “దేశ ప్రజలు 2019 ఎన్నికల్లోనూ నన్ను గెలిపించి రెండోసారి భారత ప్రధానిగా చేశారు. తద్వారా దేశంలో మరిన్ని సంస్కరణలు చేసేందుకు నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే నేను, నా ప్రభుత్వం సరికొత్త సంస్కరణలను తీసుకురాగలిగాం” అని ప్రధాని తెలిపారు.

గతంలో అవినీతి రాక్షసులు దేశ ఖజానాను దోచుకున్నారు

“ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఇంతకుముందు దేశాన్ని పాలించిన అవినీతి రాక్షసులు ఖజానాను దోచుకున్నారు. లక్షల కోట్ల కుంభకోణాలు చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం, దేశ ప్రజల జీవితాల్ని మార్చేందుకు మేం ప్రతి పైసా ఖర్చు చేస్తున్నాం. పేద ప్రజల సంక్షేమం కోసం నిధులు ఖర్చు చేస్తే దేశ ఖజానా నిండదు కానీ దేశ సామర్ధ్యం, దేశ ప్రజల సామర్ధ్యం పెరుగుతుంది. మేం దేశ ఖజానాలోని ప్రతి పైసాను నిజాయితీతో ఖర్చు చేస్తున్నాం.

గతంలో రాష్ట్రాలకు కేంద్ర సర్కారు ఏటా రూ.30 లక్షల కోట్లే ఇచ్చేది.. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రాలకు కేంద్రం రూ.100 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తోంది. గతంలో దేశంలోని స్థానిక సంస్థలకు ఏటా రూ.70వేల కోట్లు కేంద్రం కేటాయించేది.. మేం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటా రూ.3 లక్షల కోట్లు స్థానిక సంస్థలకు ఇస్తున్నాం. పేదల ఇళ్ల నిర్మాణం కోసం గతంలో కేంద్రం ఏటా రూ.90వేల కోట్లు ఇచ్చేది.. మేం ఇప్పుడు ఏటా రూ. 4 లక్షల కోట్లు ఇస్తున్నాం. పేద రైతులకు యూరియా సబ్సిడీ కోసం ఏటా రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం” అని ప్రధాని మోడీ వివరించారు.