Site icon HashtagU Telugu

PM Kisan : ఫిబ్రవరి 24న PM కిసాన్ సమ్మాన్ నిధి

PM Kisan 19th Installment

PM Kisan 19th Installment

PM Kisan: ఫిబ్రవరి 24న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీం కింద రైతులకు 19వ విడత డబ్బుల సాయం విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ రాష్ట్రం నుంచి ఈ 19వ విడత నిధులను విడుదల చేయనున్నారు. కిసాన్ యోజన కింద అర్హత కలిగిన రైతు ఖాతాకు రూ. 2,000 చొప్పున మంజూరు చేస్తారు.

కర్పూరి ఠాకూర్ 101వ జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..వ్యవసాయం, రైతుల అభివృద్ధికి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని ప్రస్తావించారు. ఈ క్రమంలో 19వ విడత పంపిణీకి ప్రధాని బీహార్ రాబోతున్నారని స్పష్టం చేశారు. ఇక, గత 18వ విడత, 2023 అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి విడుదలయ్యింది. ఇందులో 9 కోట్ల రైతుల ఖాతాలకు రూ. 20,000 కోట్లను జమ చేశారు.

కాగా, భారత ప్రభుత్వం 2019లో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఇది రైతులకు ఆర్థిక సహాయం అందించడం, వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 2,000 చొప్పున జమ చేస్తారు. ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 18 విడతలుగా రూ. 2 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలకు జమ చేశారు.

Read Also: South Africa: సౌతాఫ్రికా మ‌రో స్టార్ ఆట‌గాడికి గాయం.. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూరం?