19 Bombs Planted : అసోం సహా మన దేశంలోని చాలా ఈశాన్య రాష్ట్రాల్లో నేటికీ చాలా వేర్పాటువాద సంస్థలు యాక్టివ్‌గా ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా అవి యాక్టివ్‌గా పనిచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ చోటుచేసుకున్న ఓ ఘటనతో అసోంలో వేర్పాటువాద సంస్థల ప్రాబల్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉల్ఫా అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం. ఇదొక సాయుధ వేర్పాటు వాద సంస్థ. దీనిలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలు జరిపి జనజీవన స్రవంతిలో కలిసిపోయింది. మరో వర్గం ఇంకా సాయుధ పోరాటానికే మొగ్గుచూపుతోంది. ఆ వర్గం పేరే ఉల్ఫా-ఐ. ఇవాళ ఆ సంస్థ ఒక ప్రకటన చేసింది.
We’re now on WhatsApp. Click to Join
అసోంలోని పలు ప్రాంతాల్లో 19 బాంబులు అమర్చామని, ఆగస్టు 15 సందర్భంగా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాటిని పేల్చాలని తాము భావించామని ఉల్ఫా-ఐ తెలిపింది. అయితే సాంకేతిక కారణాల వల్ల బాంబులను(19 Bombs Planted) పేల్చకుండా వదిలేశామని వెల్లడించింది.పేలుడు పదార్థాల వల్ల సాధారణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా వాటిని రికవరీ చేయాలని పోలీసులను ఉల్ఫా-ఐ కోరింది.
Also Read :RSS Chief : బంగ్లాదేశ్ హిందువులను రక్షించాల్సిన బాధ్యత భారత్‌దే : ఆర్ఎస్ఎస్ చీఫ్
దీంతో అసోంలో కలకలం రేగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. అసోంలోని శివసాగర్, గౌహతి, నాగోన్, టిన్సుకియా జిల్లాలోని మూడు చోట్ల, దిబ్రూగఢ్ జిల్లాలో ఒక చోట, గోలాఘాట్, సోరుపత్తర్‌లో ఒక్కో ప్రదేశంలో బాంబులు అమర్చామని ఉల్ఫా-ఐ ప్రకటించడంతో పోలీసులు ఆయా ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అనుమానాస్పద పేలుడు పదార్థాల కోసం జనం రద్దీ ఉండే ప్రదేశాలను జల్లెడ పట్టారు. దీంతో శివసాగర్, నాగోన్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అనుమానాస్పద వస్తువుల్ని గుర్తించారు. మొత్తం మీద ఇవాళ సాయంత్రం సమయానికి అసోంలో ఎక్కడా పేలుళ్లు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.