Plane Crash : అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. లండన్‌కు వెళ్లేందుకు గురువారం బయలుదేరిన విమానం మద్యాహ్నం సమయంలో ఘోరంగా కూలిపోవడంతో 265 మంది ప్రయాణికులు మరణించారు. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇప్పుడు దర్యాప్తులో కీలక మైలురాయి నమోదైంది. ప్రమాద స్థలమైన భవన శిథిలాల నుంచి విమానానికి చెందిన బ్లాక్ బాక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) అధికారికంగా వెల్లడించింది. బ్లాక్‌బాక్స్‌లో దాచిన సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల అసలు కారణాలను గుర్తించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ బృందాలు కలసి పనిచేస్తున్నాయని తెలుస్తోంది.
బ్లాక్‌బాక్స్ అంటే ఏమిటి?
విమానాల్లో ఉండే బ్లాక్‌బాక్స్‌లు రెండురకాలుగా ఉంటాయి – ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) మరియు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR). మొదటిది విమానంలోని ఎంజిన్ వేగం, ఎత్తు, దిశ, ఇంధన స్థాయిలు వంటి సాంకేతిక విషయాలను రికార్డు చేస్తుంది. రెండోది పైలట్ మరియు కోపైలట్ మధ్య జరిగిన సంభాషణలు, ఏటీసీతో (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) జరిపిన మాట్లాడకలు వంటి శబ్ద సమాచారాన్ని భద్రపరుస్తుంది. ప్రమాద సమయంలో పైలట్‌లు ‘మేడే’ అనే అత్యవసర సంకేతం పంపిస్తారు. అలాంటి సందేశాలు, అంతకుముందు జరిగిన సంభాషణలు అన్ని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ (DFDR) అనే పరికరంలో భద్రంగా నిక్షిప్తమవుతాయి. ఈ రెండు భాగాల సమిష్టినే సాధారణంగా బ్లాక్‌బాక్స్‌గా పిలుస్తారు. ఇవి విమానానికి ఏ దశలో ఏమి జరిగింది అన్నదాన్ని విశ్లేషించడంలో నిపుణులకి ఎంతో ఉపయోగపడతాయి.
ప్రస్తుతం విమాన ప్రమాదం ఘటనపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ అధ్వర్యంలో సుదీర్ఘంగా దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్రానికి చెందిన 40 మంది సిబ్బంది, AAIB, DGCA బృందాలు కలిసి దర్యాప్తును మరింత ప్రగతిలోకి తీసుకెళ్తున్నాయి. బ్లాక్‌బాక్స్‌లోని డేటాను విశ్లేషించేందుకు ప్రత్యేక ల్యాబ్‌కి తరలించబోతున్నారు. ఈ సమాచారంతో ప్రమాదానికి గల అసలు కారణం ఇది సాంకేతిక లోపమా? వాతావరణ ప్రభావమా? మానవ తప్పిదమా? అన్నదాని మీద స్పష్టత రానుంది. ఈ ఘటన పట్ల పౌరవిమానయాన రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే అవకాశముంది.