Site icon HashtagU Telugu

Pilot To Replace Gehlot: రాజస్థాన్ సీఎం రేసులో సచిన్ పైలెట్,జోషీ

Pilot Gehlot

Pilot Gehlot

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీచేస్తానని ప్రకటించిన నేపథ్యంలో తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది ఇప్పుడు అక్కడ చర్చకు వచ్చింది. రాజస్థాన్ సీఎం రేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, స్పీకర్ సీపీ జోషి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సీఎల్పీ) సమావేశం ఆదివారం సాయంత్రం జైపూర్‌లోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నివాసంలో జరగనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ ఇన్‌చార్జి అజయ్ మాకెన్‌తోపాటు మల్లికార్జున్ ఖర్గేలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నియమించారు. రాజస్థాన్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి వారిద్దరూ హాజరవుతారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం తెలిపారు.

వారం వ్యవధిలో ఇది రెండో సీఎల్పీ సమావేశం. ఇంతకు ముందు ఈ నెల 20న జరిగింది. గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తర్వాత సీఎం అంశం పార్టీ నాయకత్వం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ సమావేశం అజెండాలో ఈ అంశం కూడా ఉండే అకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు గెహ్లాట్ కొచ్చిలో ప్రకటించారు.గాంధీ కుటుంబం నుంచి ఈసారి ఎవరూ అధ్యక్షులు కాకూడదని పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనకు చెప్పినట్లు తెలిపారు. సీఎంగా తన వారసుడిని ఎంపిక చేసే బాధ్యత సోనియా గాంధీ, మాకెన్ తీసుకుంటారని కూడా గెహ్లాట్ చెప్పారు.