Site icon HashtagU Telugu

Punjab: సుప్రీంకోర్టుకు చేరిన ప్రధాని మోదీ భద్రతా వివాదం

Template (27) Copy

Template (27) Copy

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. మహీందర్ సింగ్ అనే సీనియర్ అడ్వొకేట్ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భద్రతా లోపాలపై పంజాబ్ ప్రభుత్వం పాత్ర ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ ఆయన వ్యాజ్యం వేశారు.

ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలను తీసుకోవాలని కోరారు.కాగా.. వ్యాజ్యాన్ని రేపు విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

కాగా, ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం కూడా దర్యాప్తు కమిటీని నియమించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మెహతాబ్ గిల్, హోం, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీ.. ఘటనపై విచారణ చేయనుంది. మూడు రోజుల్లో నివేదికను అందించనుంది.

నిన్న పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించాల్సి ఉంది. సభ రద్దు కావడంతో హెలికాప్టర్ లో వెళ్లాల్సిన ప్రధాని వర్షం కారణంగా రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, గమ్యానికి 10 కిలోమీటర్ల దూరంలో కొందరు నిరసనకారులు ఫ్లై ఓవర్ పై అడ్డుకోవడంతో.. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది.

ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ప్రధానిని చంపేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటూ స్మృతి ఇరానీ మండిపడ్డారు. జనాలు ఎవరూ రాకపోవడంతోనే ప్రధాని వెనుదిరిగారంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ విమర్శించారు.

 

Exit mobile version