Site icon HashtagU Telugu

Phase 4 Elections : 96 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ షురూ.. ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం

Ec Increases Polling Hours

Ec Increases Polling Hours

Phase 4 Elections : ఇవాళ  ఏపీ, తెలంగాణ సహా దేశంలోని పది రాష్ట్రాలు,యూటీలలోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. వీటిలో ఏపీలోని 25, తెలంగాణలోని 17, యూపీలోని  13, మహారాష్ట్రలోని 11, మధ్యప్రదేశ్‌లోని 8, పశ్చిమబెంగాల్‌లోని 8, బీహార్‌లోని 5, ఒడిశాలోని 4, జార్ఖండ్‌లోని 4, జమ్మూకశ్మీర్‌లోని ఒక స్థానం ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, ఒడిశాలోని 28 అసెంబ్లీ స్థానాలకు కూడా ఈరోజే ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకే అన్ని స్థానాల్లోనూ పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగియనుంది. భారత ఎన్నికల సంఘం ప్రకారం.. 96 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 4,264 నామినేషన్లు వచ్చాయి. మొత్తం 1,717 మంది  అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా 1,488 నామినేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో 1,103 నామినేషన్లు వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join

ప్రధానమంత్రి సందేశం 

నాలుగో విడత ఎన్నికల (Phase 4 Elections) పోలింగ్ సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘‘ఇవాళ  నాలుగో విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 10 రాష్ట్రాలు, యూటీలలోని 96 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.  ఈ నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నాను. యువ ఓటర్లతో పాటు మహిళా ఓటర్లు కూడా ఈ ఓటింగ్‌కు బలం చేకూరుస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. రండి, మనమందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం ” అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓటర్లకు పిలుపునిచ్చారు.

Also Read :Elections 2024 : తెలంగాణ, ఏపీలో ఓట్ల పండుగ షురూ