దేశ వ్యాప్తంగా ఆరు రోజుల్లో ఐదుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారం నాడు పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో పెట్రోలు ధర 50 పైసల పెంపుతో లీటరుకు రూ. 99.11కి పెరిగింది, డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 90.42, 55 పైసలు పెరిగింది. ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 53 పైసలు, 58 పైసలు పెరిగాయి. లీటరు పెట్రోలు ధర రూ.113.88, డీజిల్ ధర రూ.98.13. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 122.37పైసలుగా ఉంది. భారతదేశం తన చమురు అవసరాలను తీర్చడానికి దిగుమతులపై ఆధారపడుతుంది కాబట్టి, ప్రపంచ ధరల మార్పులకు అనుగుణంగా రిటైల్ ధరలు మారుతూ ఉంటాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరగడంతో సామాన్యులపై తీవ్ర భారం పడుతుంది. ఇప్పటికే వంటనూనె ధరలు పెరిగపోవడంతో అతలాకుతలం అవుతున్న ప్రజలు.. ఐదుసార్లు ఇంధన ధరలు పెరగడం మరింత భారంగా మారింది. దీనిపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఒక్కసారి కూడా ఇంధన ధరలు పెంచని ప్రభుత్వం..ఎన్నికలు అయిపోగానే వరుసగా ఐదుసార్లు పెంచుకుంటూ పోతుంది. దీనిపై ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఉద్యమ కార్యచరణను ప్రకటిచింది.
