Petrol Diesel Price: ఎనిమిదో రోజు పెట్రోల్, డీజల్ ధ‌ర‌లు ఎంత పెరిగిగాయంటే..?

  • Written By:
  • Updated On - March 30, 2022 / 12:39 PM IST

ఇండియాలో గ‌డిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. దీంతో క‌ర్ర కాల్చి వాత పెట్టిన‌ట్లుగా, ఇప్పుడు దేశంలో పేట్రోల్ వాత మంట పుడుతోంది. గ‌త ఎనిమిది రోజుల్లో ఏకంగా 5 రూపాయ‌లుకు పైగానే పెట్రోల్ ధ‌ర‌లు చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి. దీంతో వామ్మో అంటూ దేశ ప్ర‌జ‌లు గుండెలు బాదుకుంటున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌ధ్యంలో గ‌త ఏడాది న‌వంబ‌ర్ 4 నుంచి అంటే దాదాపు ఐదు నెల‌లు పెట్రోల్, డీజ‌ల్ ధ‌ర‌ల జోలికి వెళ్ళ‌లేదు.

అయితే ఇప్పుడు ఆ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక కాస్త గ్యాప్ ఇచ్చిన కేంద్ర ప్ర‌భుత్వం మార్చి 22 నుంచి సామాన్యుడికి పెట్రో వాత పెట్ట‌డం మొద‌లు పెట్టింది. ఈ క్ర‌మంలో గ‌త ప‌ది రోజుల్లో క్ర‌మంగా పెంచుతూ, లీట‌ర్ పెట్రోల్ పైన 5 రూపాయ‌ల 60 పైస‌లు పెంచింది. ఈ క్ర‌మంలో ఈరోజు లీట‌ర్ పెట్రోల్‌పై 90 పైస‌లు, డీజిల్‌పై 76 పైస‌లు పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో తాజా పెంపుతో తెలంగాణ‌లోని హైదరాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర 114.51 రూపాయ‌లుకు చేర‌గా, డీజిల్ ధ‌ర రూ. 99.83 రూపాయ‌ల‌కు చేరుకుంది. ఏపీలోని విజ‌య‌వాడ‌లో లీటర్ పెట్రోల్ ధ‌ర అత్య‌ధికంగా116.39 రూపాయ‌ల‌కు చేర‌గా, లీటర్ డీజిల్ ధర 102.09 రూపాయ‌ల‌కు చేరుకుంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర 101.01 రూపాయ‌ల‌కు చేర‌గా, లీటర్ డీజిల్ ధర 92.27 రూపాయ‌ల‌కు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 115.88 రూపాయ‌ల‌కు చేరుకోగా, లీటర్ డీజిల్ ధర 100.10 రూపాయ‌ల‌కు చేరుకుంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర 110.52 రూపాయ‌ల‌కు, డీజిల్ ధర 95.42 రూపాయ‌ల‌కు చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర 106.88 రూపాయ‌ల‌కు చేరుకోగా, డీజిల్ ధర 96.76 రూపాయ‌ల‌కు చేరుకుంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర 106.46 రూపాయ‌ల‌కు చేరుకోగా, డీజిల్ ధర 90.49 రూపాయ‌ల‌కు చేరుకుంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర 100.86 రూపాయ‌ల‌కు చేరుకోగా, లీటర్ డీజిల్ ధర 96.76 రూపాయ‌ల‌కు చేరుకుంది.

ఇక ఒక‌వైపు పెట్రోల్, డీజ‌ల్ ధరలు భారీగా పెరుగుతుంటే, మ‌రోవైపు పెట్రోలియం సంస్థల వ్యవహారం వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ క్ర‌మంలో దేశంలో ధరలు పెరుగుతున్న సమయంలో, దేశ వ్యాప్తంగా అనేక చోట్ల పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తుండ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. గతంలో చ‌మురు సంస్థలు, పెట్రోల్ బంకులకు క్రెడిట్ ఇచ్చేవి, అయితే ఇప్పుడు ఆ విధానాన్ని చ‌మురు సంస్థ‌లు పక్కన పెట్టాయి. దీంతో పెట్రోల్ కానీ డీజ‌ల్ కానీ సరఫరా చేయాలంటే, ముందుగానే పేమెంట్ చేయాలని, లేదంటే స‌రుకు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని, చ‌మురు సంస్థ‌లు పెట్రోల్ బంకు యజమానులకు తేల్చి చెప్పేస్తున్నాయి. దీంతో ముందుగా డబ్బులు కట్టిన వారికి మాత్రమే చ‌మురు సంస్థలు పెట్రోల్, డీజిల్‌ను ‌సరఫరా చేస్తున్నాయి. ఏది ఏమైనా సామాన్యుడు జేబుకు మాత్రం ఓ రేంజ్‌లో చిల్లు వేస్తున్నారు చ‌మురు సంస్థ‌లు.