Pension Rules : పెన్షన్ నామినేషన్ అనేది కీలకమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటును కల్పించింది. పెన్షన్ నామినేషన్ విషయంలో తమ భర్త పేరుకు బదులుగా పిల్లల పేర్లను చేర్చేలా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వైవాహిక బంధంలో ఏమైనా ఇబ్బందులుంటే భర్తకు బదులుగా పిల్లలను నామినేట్ చేసే వెసులుబాటును కల్పించింది. ఈమేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ కొత్త రూల్స్‌ను అనౌన్స్(Pension Rules) చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
కొత్త రూల్స్ ప్రకారం.. విడాకులు, గృహ హింస, వరకట్నం వంటి కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్న మహిళలు తమ పెన్షన్ అకౌంట్లలో భర్తకు బదులుగా పిల్లల పేర్లను కూడా నమోదు చేయించవచ్చు. ఒకవేళ పిల్లలు మైనర్లు, దివ్యాంగులు అయి ఉంటే.. పెన్షన్ ఆ పిల్లల సంరక్షకులకు వెళ్తుంది. పిల్లలు మేజర్లు అయిన తర్వాత నేరుగా పెన్షన్ డబ్బును తీసుకోవచ్చు. ఈవిషయాన్ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: Shiv Sena : ఇండియా కూటమికి ‘మహా’ షాక్.. షిండే గూటికి దిగ్గజ నేత
కొత్త నిబంధన ఏమిటి ?
‘సీసీఎస్ (పెన్షన్) రూల్స్ 2021’లోని సబ్ రూల్స్ 8, 9 ప్రకారం.. ప్రస్తుతం కుటుంబ పింఛను అనేది ప్రభుత్వోద్యోగి మరణించిన తర్వాత జీవిత భాగస్వామికి మొదట మంజూరు అవుతుంది. అయితే ఉద్యోగి జీవిత భాగస్వామి కూడా మరణిస్తే లేదా ఇతర కారణాల వల్ల జీవిత భాగస్వామి అనర్హులైతే ఆ ఉద్యోగి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు అర్హులు అవుతారు. మహిళా ఉద్యోగి తన జీవిత భాగస్వామితో బంధం సరిగా లేకపోయిన సందర్భంలో ఏదైనా కోర్టులో విడాకుల కేసు పెండింగ్‌లో ఉన్నట్లయితే, జీవిత భాగస్వామి స్థానంలో కుటుంబ పెన్షన్ పొందేందుకు మహిళా ఉద్యోగి తమ పిల్లలను నామినేట్ చేయొచ్చు. స్త్రీ తన భర్తపై గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం లేదా వరకట్న నిషేధ చట్టం లేదా భారతీయ శిక్షాస్మృతి కింద కేసు నమోదు చేసినట్లయితే పిల్లలకు పెన్షన్ ఇవ్వవచ్చు. ఈ మేరకు ఆ మహిళా ఉద్యోగి మరణించిన సందర్భంలో తన పిల్లలకు పెన్షన్ ఇవ్వాలని సంబంధిత కార్యాలయానికి రాత పూర్వకంగా ముందే అభ్యర్థన చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కొత్త రూల్స్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న మహిళా ఉద్యోగి మరణానంతరం ఆమె పిల్లలు మైనర్లయితే సంరక్షకుడికి కుటుంబ పెన్షన్ అందుతుంది. వారు మేజర్లయిన తర్వాత వారే నేరుగా తీసుకునే అవకాశం ఉంటుంది.