Site icon HashtagU Telugu

Paytm Vs Phonepe : ఫోన్‌ పే, భీమ్‌ యాప్‌‌లకు రెక్కలు.. పేటీఎం కొనుగోలుకు 2 కంపెనీల పోటీ

PhonePe & Google Pay

Paytm Vs Phonepe

Paytm Vs Phonepe : పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్‌ విధించిన ఆంక్షలు.. ఫోన్‌ పే, భీమ్‌-యూపీఐ, గూగుల్‌ పే యాప్‌లకు కలిసొచ్చింది. గత నాలుగు రోజుల వ్యవధిలో ఈ మూడు యాప్‌ల డౌన్‌లోడ్స్‌ భారీగా పెరిగిపోయాయి. ఫిబ్రవరి 3న ఒక్కరోజే ‘ఫోన్‌ పే’ను 2.79 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. గత వారంతో పోలిస్తే ఈ సంఖ్య 45 శాతం పెరిగింది.  జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 మధ్యకాలంలో ఫోన్ పే యాప్‌ను 10.4 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. వినియోగదారులు, వ్యాపారులను ఆకర్షించేందుకు కొంతకాలంగా ఫోన్‌ పే మార్కెటింగ్‌లో కొత్త విధానాలను అవలంబిస్తోంది. దీంతో గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌‌లలోని ఉచిత యూపీఐ యాప్‌ల జాబితాలో ఫోన్ పే నంబర్ 1 ప్లేస్‌కు చేరుకుంది. తాజా గణాంకాల ప్రకారం.. జనవరి 31 నాటికి గూగుల్ ప్లేస్టోర్‌లో ‘ఫోన్‌ పే బిజినెస్’ యాప్‌ ర్యాంకు 188.  ఫిబ్రవరి 5వ తేదీ నాటికి ఈ ర్యాంకు కాస్తా  33వ స్థానానికి చేరుకుంది. యాప్‌ స్టోర్‌లో ఫోన్ పే(Paytm Vs Phonepe) ర్యాంకు 227 నుంచి 72కు ఎగబాకింది.

We’re now on WhatsApp. Click to Join

భీమ్‌-యూపీఐ యాప్‌, గూగుల్ పే

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)కి చెందిన భీమ్‌-యూపీఐ యాప్‌ డౌన్‌లోడ్స్‌ కూడా 50 శాతం మేర పెరగడం గమనార్హం. భీమ్‌-యూపీఐ యాప్‌ జనవరి 19న గూగుల్ ప్లేస్టోర్‌లో 326వ ర్యాంకులో ఉండగా.. ఫిబ్రవరి 5 నాటికి అది ఏడో స్థానానికి చేరింది. గూగుల్‌ పే యాప్‌ను జనవరి 31- ఫిబ్రవరి 3 మధ్యకాలంలో ప్లేస్టోర్‌లో 3.95 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు.

Also Read : Dravid – Kohli : కోహ్లీ రీ ఎంట్రీ ఎప్పుడో నాకెలా తెలుస్తుంది.. కోచ్ ద్రావిడ్ షాకింగ్ కామెంట్స్

పేటీఎం ఏమంటోంది ?

ఆర్‌బీఐ విధించిన ఆంక్షల వల్ల పొదుపు ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్, ఎన్‌సీఎంసీ ఖాతాల్లో ఉన్న డిపాజిట్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని పేటీఎం వెల్లడించింది. ఫిబ్రవరి 29 తర్వాత తమ యాప్‌ పనిచేస్తుందని పేర్కొంది.  అయితే ఈ ప్రకటన మదుపరులతోపాటు, ఖాతాదారుల్లో విశ్వాసాన్ని నింపలేకపోయింది. పేటీఎంపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు.

పేటీఎం కొనుగోలు రేసులో జియో, హెచ్‌డీఎఫ్‌సీ

పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ తన వాలెట్‌ బిజినెస్‌ను విక్రయించేందుకు ముకేశ్‌ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో చర్చ లు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పేటీఎం వాలెట్‌ సేవలు.. ఆర్‌బీఐ నిషేధం విధించిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ పరిధిలోకే వస్తాయి. పేటీఎం మేనేజ్‌మెంట్‌ గత నవంబరు నుంచే జియో ఫైనాన్షియల్‌తో చర్చలు జరుపుతోందని, హెచ్‌డీఎఫ్‌సీతో చర్చలు ఆర్‌బీఐ నిషేధానికి కొన్ని రోజుల ముందే ప్రారంభించినట్లు సమాచారం. అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌‌.. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను మొత్తంగా కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్న ట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి.హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన డిజిటల్‌ వాలెట్‌ పేజాప్‌కు ఇప్పటికే 1.4 కోట్ల మంది కస్టమర్లున్నారు. పేటీఎం వాలెట్‌ను కొంటే.. ఈ సెగ్మెంట్లో అగ్రగామిగా మారుతుంది. జియో ఫైనాన్షియల్స్‌కు పేటీఎంతో డీల్‌ బాగా కలిసిరావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.