Army Helicopter : ఇటీవలి కాలంలో భారత గగనతలంలో మానవ తప్పిదాలు కాకుండా సాంకేతిక లోపాలతో సంబంధం ఉన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అహ్మదాబాద్‌లో గురువారం చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం మరువకముందే, మరొక ప్రమాదం పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్ జిల్లా వేదికగా జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్యలతో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. సంతోషకర విషయమేంటంటే ఈ ప్రమాదం నుంచి పైలట్ అప్రమత్తతతో బయటపడగలిగారు. ప్రాణాపాయానికి ఎటువంటి అవకాశమూ లేకుండా ప్రయోగాత్మకంగా హెలికాప్టర్‌ను సురక్షితంగా భూమిపై దించగలిగారు.
శుక్రవారం ఉదయం పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి అపాచీ అటాక్ హెలికాప్టర్ నంగల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హాలెడ్ గ్రామం వైపు బయలుదేరింది. కానీ గాలిలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత హెలికాప్టర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తినట్లు సమాచారం. పైలట్ అప్రమత్తంగా వ్యవహరిచి అత్యవసరంగా ఓ ఖాళీ ప్రదేశంలో హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు.
హెలికాప్టర్ భూమిపై దిగిన వెంటనే గ్రామస్థులు సంఘటనా స్థలానికి పరుగులు పెట్టారు. పాఠశాలలు, పొలాలు సమీపంలో ఉండటంతో ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. పైలట్ ఇచ్చిన సమాచారంతో వెంటనే రక్షణ శాఖ అధికారులూ, స్థానిక పోలీస్ బృందాలూ సంఘటనా స్థలానికి చేరుకుని హెలికాప్టర్ సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. హెలికాప్టర్‌లో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది పూర్తిగా సాంకేతిక లోపం వల్ల జరిగిన సంఘటనగానే భావిస్తున్నారు. కానీ, అసలు లోపం ఏందో, ఎక్కడ ఎలా తలెత్తిందో వివరాలను మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు. హెలికాప్టర్‌ను తనిఖీ చేయడం, బ్లాక్‌బాక్స్, టెక్నికల్ లాగ్స్‌ను పరిశీలించడం వంటి ప్రక్రియలు త్వరలో చేపడతామని అధికారులు వెల్లడించారు.
ఇటీవలే అహ్మదాబాద్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన తర్వాత వాస్తవికతపై మళ్లీ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని విమానయాన పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా అపాచీ హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కూడా అదే విషయాన్ని హైలైట్ చేస్తోంది.
గగనతల భద్రతపై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అధునాతన రక్షణ వ్యవస్థలతో పాటు సాంకేతిక అప్‌డేట్లపై సమగ్ర సమీక్ష అవసరమని వాయు దళ పరిశీలకులు అంటున్నారు.
Ahmedabad Plane Crash: విమాన శిథిలాల్లో దొరికిన కీలక క్లూ.. DVR