Site icon HashtagU Telugu

Indians in Ukraine : ఉక్రెయిన్ విద్యార్థుల `పాస్ పోర్ట్` ల గ‌ల్లంతు

Indians In Ukraine

Indians In Ukraine

ఓ క‌న్స‌ల్టెన్సీ నిర్వాకం కార‌ణంగా ఉక్రెయిన్లో వేలాది మంది విద్యార్థుల వ‌ద్ద పాస్ పోర్ట్ లు లేకుండా రోడ్డున ప‌డాల్సిన దుస్థితి ఏర్పడింది. జూనియ‌ర్ విద్యార్థుల పాస్ పోర్ట్ లను ఆ క‌న్స‌ల్టెన్సీ హోల్డ్ చేసింద‌ని తెలుస్తోంది. భారీ ఫీజుల కోసం ప్ర‌తి ఏడాది ఆ క‌న్స‌ల్టెన్సీ కోర్సు పూర్తియ్యే వ‌ర‌కు పాస్ పోర్ట్ ల‌ను హోల్డ్ చేస్తోంద‌ని స‌మాచారం. అందుకు సంబంధించిన కొన్ని కేసుల‌ను కూడా ఆ ప్రైవేటు క‌న్స‌ల్టెన్సీ ఎదుర్కొంటోంది. ప్ర‌తి ఏడాది వేలాది మంది విద్యార్థులు ఉన్న‌త చ‌దువుల కోసం ఉక్రెయిన్ వెళుతుంటారు. ప్ర‌త్యేకించి ఎంబీబీఎస్ చ‌ద‌వు త‌క్కువ ఖ‌ర్చుతో అక్క‌డ అందుబాటులో ఉంది. ప‌లు యూనివ‌ర్సిటీలు భార‌త విద్యార్థుల‌ను గ‌త కొన్నేళ్లుగా ఆక‌ర్షిస్తున్నాయి. ఇండియాలోని ప‌లు ప్రాంతాల్లో ఏజెంట్ల‌ను ఏర్పాటు చేసుకుని ఉక్రెయిన్ యూనివ‌ర్సిటీలు అడ్మిష‌న్స్ ఇస్తున్నాయి. ఇటీవ‌ల ఆ ఒర‌వ‌డి బాగా పెరిగింది. ప్ర‌త్యేకించి కీవ్ స‌మీపంలోని జ‌ప్రోజియా స్టేట్ యూనివర్సిటీకి ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు వెళుతుంటారు. హైద‌రాబాద్ లోని ఒక క‌న్స‌ల్టెన్సీ పెద్ద సంఖ్య‌లో విద్యార్థుల‌ను జ‌ప్రోజియా యూనివ‌ర్సిటీకి త‌ర‌లించింది. ఆ క‌న్స‌ల్టెన్సీ మీద గ‌తంలో అనేక కేసులు కూడా ఉన్నాయి. విద్యార్థుల స‌ర్టిఫికేట్లు తీసుకుని బ్లాక్ మెయిల్ చేసిన కేసులను ఆ క‌న్స‌ల్టెన్సీ ఎదుర్కొంటోంది. ఫీజుల‌ను అత్య‌ధికంగా రాబ‌ట్టేందుకు స‌ర్టిఫికేట్లతో పాటు పాస్ పోర్ట్ ను తీసుకుని ఐదేళ్ల త‌రువాత ఇచ్చేలా ఆ క‌న్స‌ల్టెన్సీ వ్య‌వ‌హ‌రిస్తోందట‌. దీంతో ఉక్రెయిన్లోని చాలా మంది విద్యార్థుల వ‌ద్ద పాస్ పోర్ట్ లు ఇప్పుడు వాళ్ల వ‌ద్ద లేవు.

Also Read :  సైబ‌ర్ దాడుల‌తో ‘ఉక్రెయిన్’ నిర్వీర్యం

ఆ క‌న్స‌ల్టెన్సీ ప్ర‌తినిధులు విద్యార్థుల‌కు అందుబాటులో లేక‌పోవ‌డంతో పాటు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కూడా పూర్తి స్థాయి ఫీజులు చెల్లిస్తేనే పాస్ పోర్టులు ఇస్తామ‌ని డిమాండ్ చేస్తోంద‌ని విద్యార్థుల ఆరోప‌ణ‌. ఆ క‌న్స‌ల్టెన్సీ ప్ర‌తినిధి జూమ్ ద్వారా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌మావేశంలో పాల్గొన‌డం గ‌మ‌నార్హం. సుమారు 30వేల మంది వ‌ర‌కు జ‌ప్రోజియా స్టేట్ యూనివ‌ర్సిటీలో తెలుగు విద్యార్థులు ఉంటారు. ప‌దేళ్లుగా ఆ యూనివ‌ర్సిటీని ఒక క‌న్స‌ల్టెన్సీ ప్ర‌మోట్ చేస్తోంది. హైద‌రాబాద్ కేంద్రంగా చేసుకుని ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థుల‌ను రాబ‌ట్టుకుంటోంది. అడ్మిష‌న్ ఇచ్చే వ‌ర‌కు ఒక విధంగా అడ్మిష‌న్ ముగిసిన త‌రువాత మ‌రో విధంగా విద్యార్థులు, వాళ్ల త‌ల్లిదండ్రుల‌తో వ్య‌వ‌హ‌రిస్తూ కొన్ని సంద‌ర్భాల్లో బ్లాక్ మెయిల్ కూడా పాల్ప‌డిన‌ట్టు కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఆ క‌న్స‌ల్టెన్సీ వ‌ద్ద ఉన్న పాస్ పోర్టులు ఎలా వ‌స్తాయో విద్యార్థులకు అర్థం కావ‌డంలేదు.ప్ర‌స్తుతం బంక‌ర్ల‌లో తెలుగు విద్యార్థులు వేలాది మంది ఉక్రెయిన్లో త‌ల‌దాచుకున్నారు. కొంద‌రు మాత్రం జూమ్ మీటింగ్ ల‌కు రాగ‌లుగుతున్నారు. సీనియ‌ర్లు ఏదో ఒక ర‌కంగా కొంద‌రు అందుబాటులోకి వ‌స్తున్నారు. జూనియ‌ర్లు మాత్రం పాస్ పోర్టులు లేక‌పోవ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు. ఇండియ‌న్ ఎంబ‌సీ క‌నుక హైద్రాబాద్ కేంద్రంగా ఉన్న క‌న్స‌ల్జెన్సీని అందుపులోకి తీసుకుంటే ఉక్రెయిన్లోని విద్యార్థుల ఆనవాళ్లు 90 శాతం దొరికే అవ‌కాశం ఉంది. లేదంటే, పాస్ పోర్టులు లేక‌పోవ‌డంతో బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి అక్క‌డ లేదు. ఏపీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి త‌ర‌లించ‌డానికి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. ఇండియ‌న్ ఎంబ‌సీతో ట‌చ్ లో ఉండ‌డానికి ఐఏఎస్ ల‌తో కూడిన ప్ర‌త్యేక టీంల‌ను ఏర్పాటు చేశాయి. వాళ్లు ప్ర‌తిక్ష‌ణం ఇండియ‌న్ ఎంబ‌సీతో ట‌చ్ లో ఉంటూ విద్యార్థుల ఆచూకి క‌నుగొనే ప‌నిలో ఉన్నారు. హెల్ప్ లైన్ నెంబ‌ర్ల‌ను కూడా తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించాయి. మ‌రో వైపు తెలుగుదేశం పార్టీ ఎన్నారై సెల్ ప్ర‌త్యేకంగా ఉక్రెయిన్లోని తెలుగు వాళ్ల‌ను కాపాడేందుకు రంగంలోకి దిగింది. ఇప్ప‌టికే ప‌లువురితో చంద్ర‌బాబు జూమ్ ద్వారా సంప్ర‌దింపులు జ‌రిపారు.

Also Read :  ప్ర‌మాదంలో ‘విమాన‌యానం’

ఉక్రెయిన్లో భార‌తీయుల‌కు స‌హాయం అందించేందుకు హంగరీ, రొమేనియా సరిహద్దు ప్ర‌త్యేక చెక్ పోస్ట్ ల వ‌ద్ద ప్రత్యేక బృందాలు ఉన్నాయి. అక్క‌డికి వెళ్లి సాయం పొందాలని భార‌త ప్ర‌భుత్వం సూచించింది. ఉక్రెయిన్ లో తెలుగు వాళ్ళ కోసం ఏపీ సీఎం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చీఫ్ సెక్ర‌ట‌రీ స‌మీర్ శ‌ర్మ‌తో పాటు ఐఏఎస్ లు కృష్ణ బాబు, అరుణ్ కుమార్, దినేష్ కుమార్, గీతేష్ శర్మలతో కంట్రోల్ రూమ్ ప‌ని చేస్తోంది. ఎవ‌రైనా 1902కి కాల్ చేసి పిల్లల వివరాలు తెలపొచ్చని ఏపీ ప్ర‌భుత్వం తెలిపింది. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో రెండు కేంద్రాలు తెలుగు వాళ్ల కోసం ప‌నిచేస్తున్నాయి. అక్కడికి చేరే వారిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్ర‌త్యేకంగా 48660460814, 48606700105 నంబర్లకు ఫోన్ చేయ‌డం ద్వారా స‌హాయం పొంద‌డానికి అవ‌కాశం ఉంది. సమన్వయ పరిచేందుకు ఏపీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు అయింది. ఇప్పటికి 130 మంది కాల్ చేశారని స‌మీర్ శ‌ర్మ వెల్ల‌డించాడు. వెయ్యి మంది తెలుగు విద్యార్థులు ఉంటారని ఏపీ ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో ప్ర‌త్యేక జిల్లా సెల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ స‌మీపంలోని నాలుగు 4 సరిహద్దు ప్రాంతాలకు 4 టీమ్ లు వెళ్తున్నాయ‌ని శ‌ర్మ వెల్ల‌డించాడు. పోలెండ్ , హంగేరి, రొమానియా సరిహద్దు ప్రాంతాల్లో టీమ్ లను పెట్టినట్లు చెప్పాడు. ఇన్ని ఏర్పాట్లు చేసిన‌ప్ప‌టికీ విద్యార్థులు బ‌య‌ట‌కు రావ‌డానికి పాస్ పోర్టులు అవ‌స‌రం. ఆ పాస్ పోర్టులు క‌న్స‌ల్టెన్సీ వ‌ద్ద ఉండ‌డంతో విద్యార్థుల ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా ఉంది.