Parliament Discussions: నిరనలు.. వాయిదాలు.. 30 రోజుల్లో నడిచింది 45 గంటలే

నిరసనలు, నినాదాలతో పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌ వాషౌట్ అయ్యింది. వాయిదాల పర్వం కొనసాగడంతో.. మలి దశ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి.

  • Written By:
  • Publish Date - April 7, 2023 / 12:00 AM IST

Parliament Discussions: నిరసనలు, నినాదాలతో పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌ వాషౌట్ అయ్యింది. వాయిదాల పర్వం కొనసాగడంతో.. మలి దశ సమావేశాలు తుడిచిపెట్టుకుపోయాయి. పార్లమెంట్ ప్రతిష్టంభనకు కేంద్రమే కారణమని మండిపడిన విపక్షాలు.. స్పీకర్‌ తేనీటి విందునూ బాయ్‌కాట్ చేశాయి.పార్లమెంట్ రెండో విడత సమావేశాలు ముగిశాయి. ఉభయసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలు, నినాదాలతో.. బడ్జెట్ సెషన్ తుడిచిపెట్టుకుపోయింది. వార్షిక బడ్జెట్‌ను కూడా ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదించాయి రెండు సభలు.

రెండో దశ బడ్జెట్ సమావేశాలు మార్చి 13న ప్రారంభం అయ్యాయి. అదానీ వ్యవహారంలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌పై జేపీసీ విచారణకు ఆదేశాలించాలంటూ నిరసన కొనసాగించాయి విపక్షాలు. దీనికి కౌంటర్‌గా యూకే పర్యటనలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల అంశాన్ని హైలైట్ చేసింది అధికార పక్షం. విదేశాల్లో భారత వ్యతిరేక ప్రకటనలు చేసినందుకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ సభ్యులు. దీంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం నడిచింది. నిరసనలు, నినాదాలతో పార్లమెంట్‌ వ్యవహారాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం లోక్‌సభ 133.6 గంటలు పనిచేయాల్సి ఉండగా.. సభ నడిచింది 45 గంటలు మాత్రమే. 130 గంటలకు.. కేవలం 31 గంటలే పనిచేసింది రాజ్యసభ .

దీంతో ప్రొడక్టవిటి దారుణంగా పడిపోయింది. లోక్‌సభలో క్వశ్చ్యన్ అవర్ 4.32 గంటలు నడవగా.. రాజ్యసభలో కేవలం 1.85 గంటలే కొనసాగింది. గందరగోళం మధ్యే 6 బిల్లులు ఆమోదించింది దిగువసభ. పార్లమెంట్ వాషౌట్‌కు మోదీ సర్కారే కారణమని మండిపడ్డారు కాంగ్రెస్ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే. బడ్జెట్ సమావేశాలను కేంద్రమేఅడ్డుకుందని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు. 50 లక్షలకోట్ల బడ్జెట్‌ను.. 12 నిమిషాల్లోనే ఆమోదిస్తారా అని కేంద్రాన్ని ఖర్గే నిలదీశారు .

పార్లమెంట్ వాయిదా పడినా కేంద్రంపై పోరాటం కొనసాగిస్తున్నాయి విపక్షాలు. అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ.. విజయ్ చౌక్ వరకూ తిరంగా మార్చ్ నిర్వహించాయి. అలాగే లోక్‌సభ స్పీకర్ ఇచ్చే సంప్రదాయ తేనీటి విందును బాయ్‌కాట్ చేశాయి విపక్షాలు. కాంగ్రెస్ సహా 13 ప్రతిపక్ష పార్టీలు ఈవ్నింగ్ టీకి గైర్హాజరయ్యాయి.