Waqf Assets : దేశవ్యాప్తంగా వక్ఫ్ (సవరణ) బిల్లు చర్చనీయాంశంగా మారిన వేళ అస్సాంకు చెందిన ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీలోని పార్లమెంట్ భవనం, దాని పరిసరాల్లోని ప్రాంతాలు వక్ఫ్ ఆస్తులే అని ఆయన కొత్త వివాదానికి తెరలేపారు. అక్కడితో ఆగకుండా వక్ఫ్ బిల్లు కారణంగా ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. ఢిల్లీ వసంత్ విహార్ చుట్టుపక్కల 50 విదేశీ దౌత్య కార్యాలయాలు ఉన్నాయని, ఢిల్లీ ఎయిర్‌పోర్టు కూడా వక్ఫ్ ఆస్తిపైనే నిర్మించారని అన్నారు.
మీడియాలో మాట్లాడిన బద్రుద్దీన్ అజ్మల్.. ”పార్లమెంట్ భవనం కూడా వక్ఫ్ ఆస్తిలో భాగమే. విమానాశ్రయం కూడా వక్ఫ్ భూమిలో నిర్మించబడింది. అనుమతి లేకుండా వక్ఫ్ భూమిని ఉపయోగించడం తప్పు. ఈ వక్ఫ్ బోర్డు సమస్యపై త్వరలో తమ ప్రభుత్వం పడిపోతుంది.” అని అన్నారు. ప్రస్తుతం వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చర్చిస్తోంది. వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. వక్ఫ్ బోర్డుకు ఉన్న అపరిమిత అధికారాలను తొలగించాలని ఈ బిల్లుని తీసుకువచ్చారు. అయితే, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఎస్పీ ఇతర పార్టీలు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది మతస్వేచ్ఛని ఉల్లంఘించడమే అని చెబుతున్నాయి. ఏదైనా ఆస్తి లేదా ప్రాంతాన్ని ”వక్ఫ్ ఆస్తి”గా పేర్కొనే వక్ఫ్ బోర్డుల అధికారాలను పరిమితం చేయడమే కేంద్రం లక్ష్యం.
ఇదిలా ఉంటే, అజ్మల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. వక్ఫ్(సవరణ) బిల్లుకి అందరు ఎంపీలు మద్దతు తెలిపాలని కోరారు. పార్లమెంట్, మున్సిపల్ బిల్డింగ్స్, ఏయిర్ పోర్ట్స్, నగరాలు, గ్రామాలను రక్షణ అవసరం, ప్రపంచంలోనే అతిపెద్ద వక్ఫ్ ఆస్తులు ఇండియాలోనే ఉన్నాయని అన్నారు. వీటిని ముస్లిం కమ్యూనిటీలోని మహిళలు, పిల్లలు, వెనకబడిన వారి సంక్షేమానికి ఉపయోగించాలని ట్వీట్ చేశారు.