Indian Students In Canada: భారతదేశం- కెనడా మధ్య క్షీణిస్తున్న సంబంధాల కారణంగా కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు (Indian Students In Canada) చాలా టెన్షన్‌లో ఉన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని తల్లిదండ్రులు ఇరు దేశాల ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నారు. వాస్తవానికి ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
1996లో నకిలీ పాస్‌పోర్ట్ ద్వారా హర్దీప్ సింగ్ నిజ్జర్ భారత్ నుంచి కెనడాకు వెళ్లాడు. అక్కడ అతను ఖలిస్తానీ కార్యకలాపాలలో పాలుపంచుకున్నాడు. భారతదేశ వ్యతిరేక ఎజెండాను నడిపాడు. ఈ ఏడాది జూన్‌లో కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రే నగరంలోని గురుద్వారా వెలుపల ఆయనను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ విషయమై విచారణ సాగుతోంది. అయితే ఈ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని, దీని కారణంగా భారత్-కెనడా సంబంధాలు క్షీణించాయని ట్రూడో ఆరోపించారు.
తల్లిదండ్రులు ఏమి చెబుతున్నారు..?
భారత్, కెనడా మధ్య చెడిన సంబంధాల కారణంగా తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అమృత్‌సర్‌లో నివాసముంటున్న కుల్‌దీప్ కౌర్ కుమార్తెలు కెనడాలో చదువుతున్నారు. వారు వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. వారి భద్రత గురించి తాను ఆందోళన చెందుతున్నానని అన్నారు. వారికీ ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతున్నారు. ఇరు దేశాల ప్రభుత్వాలు ఏకతాటిపైకి వచ్చి పరిష్కారాన్ని కనుగొనాలన్నారు. తన కుమార్తెలు గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా కెనడాలో చదువుతున్నారని కౌర్ చెప్పారు.
అమృత్‌సర్ నివాసి బల్వీందర్ సింగ్‌కు కూడా ఇదే భయం ఉంది. అతని కూతురు ఏడు నెలల క్రితమే కెనడా వెళ్ళింది. బల్వీందర్ మాట్లాడుతూ.. ‘ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్కడ నా కూతురు చాలా టెన్షన్‌లో ఉంది. చదువుపై ఏకాగ్రత కుదరడం లేదు. మరోవైపు కెనడాకు వెళ్లి చదువుకోవాలని భావించిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వారు తమ ప్రణాళికలను నిలిపివేశారు. భారత్, కెనడాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణమని చెప్పుకొచ్చాడు.
అదే సమయంలో కెనడా హైకమిషన్ భారతదేశంలో దౌత్యపరమైన ఉనికిని తగ్గించుకోబోతోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి శనివారం చెప్పడంతో భారతదేశం- కెనడా మధ్య ఉద్రిక్తత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఖలిస్తానీ టెర్రరిస్టు హత్యకు కెనడా.. భారతదేశాన్ని నిందించిన తర్వాత ఒట్టావాను విడిచిపెట్టమని భారత సీనియర్ దౌత్యవేత్తను కోరిన విషయం తెలిసిందే. కెనడా దౌత్యవేత్తను వెళ్లిపోవాలని కోరడం ద్వారా భారతదేశం కూడా ప్రతీకారం తీర్చుకుంది.