North India Tremors : పొరుగుదేశం నేపాల్‌లో సంభవించిన భూకంపం ప్రభావం మన దేశంలోని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్‌లపైనా స్వల్పంగా కనిపించింది. ఈ రాష్ట్రాల్లోని పలుచోట్ల భూమి స్వల్పంగా కంపించింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని అంటున్నారు. భూ ప్రకంపనలు ఫీలైన ప్రాంతాల్లోని ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్లను వదిలి రోడ్లపైకి పరుగులు తీశారు. భయంతో రాత్రంతా వీధుల్లో తిరుగుతూ గడిపారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో అసలు ఏం జరిగిందన్నది అర్థం కావడానికి సమయం పట్టిందని ఢిల్లీవాసులు చెప్పారు. ఇంట్లో వస్తువులు ఒక్కసారిగా ఊగినట్టు కనిపించగానే.. బయటకు పరుగులు తీశామన్నారు. శుక్రవారం రాత్రి 11.32 గంటలకు ఉత్తర భారతదేశం శివార్లలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. బీహార్‌లోని పాట్నా, కతిహార్, మోతిహారి, ఇండో-నేపాల్ సరిహద్దులోని మరికొన్ని జిల్లాల్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గత నెల రోజుల వ్యవధిలో ఉత్తర భారతదేశంలో సంభవించిన మూడో అతిపెద్ద భూకంపం ఇది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే..
‘‘నేను శుక్రవారం రాత్రి టీవీ చూస్తుండగా.. అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత న్యూస్ ఛానల్స్ చూస్తే.. భూకంపం సంభవించిందని బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. దీంతో నేను మా ఇంటి నుంచి బయటికి వెళ్లి చూస్తే.. అందరూ రోడ్లపై ఉన్నారు. దీంతో నేను కూడా భయంతో బయటికి వెళ్లిపోయాను’’ అని నోయిడాకు చెందిన ఓ వ్యక్తి చెప్పారు.‘‘నేను మంచం మీద పడుకున్నాను. అకస్మాత్తుగా మంచం వణకడం మొదలుపెట్టింది. సీలింగ్ ఫ్యాన్ కూడా కదులుతుండటం గమనించాను. వెంటనే భయంతో నేను నా ఇంటి నుంచి బయటకు వచ్చాను’’ అని పాట్నాకు చెందిన ఒక వ్యక్తి(North India Tremors) చెప్పారు.