జమ్మూ కశ్మీర్‌లోని పహెల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ రెండు వారాల తరువాత భారీ మెరుపుదాడులు జరిపింది. మంగళవారం అర్ధరాత్రి తరువాత పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం “ఆపరేషన్ సింధూర్” పేరుతో దాడులు చేసింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపాయి. భారత రక్షణ శాఖ ప్రకారం ఈ దాడుల్లో ఉగ్రవాదులు భారీగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ మరోసారి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతూ స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చింది.
Pahalgam Terror Attack : ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల యోధులకు నా సెల్యూట్ : సీఎం చంద్రబాబు
ఈ ఆపరేషన్‌లో జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ కుటుంబ సభ్యులపై కూడా దాడి జరిగిందన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. బహావల్పూర్‌లోని అతని నివాస సమీపంలోని ఉగ్ర శిబిరంపై జరిగిన దాడిలో అజర్ కుటుంబానికి చెందిన 14 మంది వరకు మృతి చెందారని సమాచారం. అయితే మసూద్ అజర్ ఆ సమయంలో అక్కడ లేడని జైషే వర్గాలు పేర్కొన్నాయి. దాడుల అనంతరం భారత బలగాలు విజయవంతంగా లక్ష్యాలను ఛేదించి తిరిగి వచ్చాయి.
భారత చర్యలతో తీవ్ర ఒడిదుడుకులకు లోనైన పాకిస్థాన్ ఇప్పుడు శాంతి ప్రకటనలు చేస్తోంది. భారత్ దాడులు ఆపితే తాము కూడా ఆపుతామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. యుద్ధానికి దూరంగా ఉండేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పాకిస్థాన్ శాంతిని కోరుకుంటుందని పేర్కొన్నారు. కానీ పాకిస్థాన్ గతంలో చేసిన వాగ్దానాలకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిందని గుర్తు చేస్తూ, ఈసారి భారత్ మరింత కఠినంగా స్పందించిందని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.