Article 370 Restoration : ఆర్టికల్ 370.. ఇది అమలులో ఉన్నన్ని రోజులు జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉండేది. అయితే దీన్ని 2019లో భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం కశ్మీరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఆ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఆర్టికల్ 370ని(Article 370 Restoration) పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ అంటోంది. ఈ అంశంపై ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి రియాక్షన్ వచ్చింది. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read :Unit 8200 : లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల వెనుక ‘యూనిట్ 8200’.. ఏమిటిది ?
‘‘జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో మా వైఖరి, భారత్‌లోని కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి వైఖరి అచ్చం ఒకేలా ఉంది’’ అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయన అంచనా వేశారు. ‘‘ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏలను పునరుద్ధరణ చేస్తామని కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అంటోంది. మేమూ అదే కోరుకుంటున్నాం’’ అని ఖవాజా ఆసిఫ్ చెప్పారు.
Also Read :Lebanon Explosions : పేజర్లు, వాకీటాకీల పేలుడు.. 32కు చేరిన మృతులు
కశ్మీర్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని బీజేపీ అంటోంది. అయితే ఆర్టికల్ 370ని పునరుద్ధరించే శక్తి ఎవరికీ లేదని తేల్చి చెబుతోంది. వాస్తవానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. జమ్మూకశ్మీర్, లడఖ్ అనేవి ఇప్పుడు రెండు వేర్వేరు యూటీలు. దీంతోపాటు జమ్మూకశ్మీరు అసెంబ్లీలో కొత్తగా 29 నామినేటెడ్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ 29 సీట్ల ద్వారా అసెంబ్లీపై పట్టు సాధించే వ్యూహంతో బీజేపీ ఉంది. కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈనేపథ్యంలో త్వరలో కశ్మీరులో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కూడా అంత స్వేచ్ఛగా పాలన సాగించే అవకాశాలు ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.