Pakistan: భారత ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టించింది. చీనాబ్ నదిపై నిర్మించనున్న దుల్హస్తీ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ రెండో దశకు పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ పచ్చజెండా ఊపింది.
భారత్ భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్!
డిసెంబర్ 27న ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించాయి. దీనిపై పాకిస్తాన్ స్పందిస్తూ భారత్ ‘సింధు జలాల ఒప్పందాన్ని’ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. పాకిస్తాన్ ఎంపీ, మాజీ పర్యావరణ మంత్రి షెరీ రెహ్మాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. భారత్ నీటిని ఆయుధంగా ఉపయోగిస్తోందని, దీనిని అంగీకరించబోమని విమర్శించారు.
షెరీ రెహ్మాన్ వాదన ప్రకారం.. భారత్ ఏకపక్షంగా సింధు ఒప్పందం నుండి వెనక్కి తగ్గుతోందని, చీనాబ్ నదిపై సావల్‌కోట్, రేటల్, బర్సర్, పాకల్ దుల్, కీరూ, కిర్థాయ్, ఇప్పుడు దుల్హస్తీ స్టేజ్-2 వంటి వివాదాస్పద ప్రాజెక్టులను వేగవంతం చేస్తోందని ఆరోపించారు.
Also Read: రేపే ఏకాదశి.. ఇలా చేయకుంటే పూజ చేసిన వృథానే!!
పాకిస్తాన్‌పై భారత్ ‘వాటర్ స్ట్రైక్’
ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 22 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి నిరసనగా భారత్ పాకిస్తాన్‌పై పలు ఆంక్షలు విధించింది. అందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్‌తో ఎలాంటి నదీ సంబంధిత డేటాను షేర్ చేయడం లేదు. దీని ప్రభావం ఇప్పుడు ఈ కొత్త హైడ్రోపవర్ ప్రాజెక్టుల వేగంపై స్పష్టంగా కనిపిస్తోంది.
‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’
పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ.. “నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు” అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్ ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా, సరిహద్దు ప్రాంతాల్లో అభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుంది. దీనితో పాటు దాదాపు 1856 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సావల్‌కోట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధమవుతోంది.
