PM Modi : ఇటీవలే భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పోలండ్, ఉక్రెయిన్ దేశాల్లో మూడు రోజులు పర్యటించి తిరిగొచ్చారు. ఈనేపథ్యంలో ఆయనకు మరో కీలకమైన దేశం నుంచి ఆహ్వానం అందింది. ఇస్లామాబాద్ పర్యటనకు రావాలంటూ పాకిస్తాన్ నుంచి భారత ప్రధానికి ఇన్విటేషన్ వచ్చింది. ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా ?
We’re now on WhatsApp. Click to Join
ఈ ఏడాది అక్టోబరు నెలలో ఇస్లామాబాద్ నగరంలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు జరగబోతోంది. దీనిలో పాల్గొనాలని కోరుతూ మోడీని పాకిస్తాన్ ప్రభుత్వం ఆహ్వానించింది. మరోవైపు చైనా, రష్యాలకు కూడా పాకిస్తాన్ ఇన్విటేషన్ పంపింది. షాంఘై సహకార సంస్థలో కీలకమైన విభాగం కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్‌జీ). ఇందులో ఎస్‌సీవో సభ్యదేశాలకు చెందిన ప్రభుత్వాధినేతలు ఉంటారు. అందుకే ఎస్‌సీవో సదస్సులో అత్యంత కీలకమైనది సీహెచ్‌జీ సమావేశమే. షాంఘై సహకార సంస్థ 1996లో ఏర్పాటైంది. దీనిలో 9 సభ్య దేశాలు ఉన్నాయి. 4 యూరేషియా ప్రాంత దేశాలు పరిశీలక సభ్యత్వ హోదాలో ఉన్నాయి. చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్, ఇరాన్, బెలారస్ దేశాలు షాంఘై సహకార సంస్థలో ఉన్నాయి.
Also Read :Vem Narender Reddy : ‘‘నా పేరుతో వసూళ్లు చేసే వాళ్లను నమ్మకండి’’.. వేం నరేందర్ రెడ్డి ప్రకటన
గత సంవత్సరం ఎస్‌సీవో సదస్సు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్ఖండ్ నగరంలో జరిగింది. అప్పట్లో భారత ప్రధాని మోడీ(PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. భారత్-పాక్ సరిహద్దుల్లో హైటెన్షన్ ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కాల్పుల్లో ఎంతోమంది భారత జవాన్లు, సామాన్య కశ్మీరీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈనేపథ్యంలో పాకిస్తాన్ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్‌కు భారత ప్రధాని మోడీ వెళ్లే అవకాశాలు లేవని అంటున్నారు. ప్రధాని మోడీకి బదులుగా విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొనే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. అయితే విదేశాంగ మంత్రి జైశంకర్ భద్రతపై భారత నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.పాకిస్థాన్‌లో చివరిసారిగా 2015లో అప్పటి భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పర్యటించారు. భద్రతా కారణాల రీత్యా ఈసారి పాకిస్తాన్‌లో జరగనున్న ఎస్‌సీవో సదస్సుకు హాజరుకావాలా ? వద్దా ? అనే దానిపై భారత్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ నేరుగా ఆ సదస్సుకు హాజరుకావొద్దని నిర్ణయించుకుంటే.. భారత ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొనే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.