Pak spy : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం, భద్రతా విభాగాలు దేశంలోని గూఢచార చర్యలను అణిచివేయడంలో తీవ్రంగా నిమగ్నమయ్యాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌కు సహకరిస్తున్న నిఘా నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ జస్బీర్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం, జస్బీర్ సింగ్ రూపనగర్ జిల్లాలోని మహలాన్ గ్రామానికి చెందినవాడు. ఇతడు ‘జాన్ మహల్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతూ లక్షలాది మందికి సమాచారం అందిస్తూ వచ్చాడు. అతని ఛానెల్‌కు 1.1 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కానీ ఇతడు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ (ISI)కు సమాచారాన్ని అందిస్తున్నాడనే ఆరోపణలపై పోలీసులు నిఘా పెట్టి, చివరికి అరెస్టు చేశారు.
Read Also: Massive Accident : మధ్యప్రదేశ్ ఝాబువాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి..
పోలీసుల చెబుతున్న కథనం ప్రకారం, జస్బీర్ పాకిస్థాన్‌కు చెందిన గూఢచారి షకీర్ అలియాస్ జుట్ రాంధావా, అలాగే పాక్ రాయబార కార్యాలయ అధికారిగా ఉన్న ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. డానిష్ ఆహ్వానంతో ఢిల్లీలో పాక్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన జాతీయ దినోత్సవ వేడుకకు సింగ్ హాజరైనట్టు అధికారులు గుర్తించారు. గతంలో 2020, 2021, 2024 సంవత్సరాల్లో పాకిస్థాన్‌కు వెళ్లిన రికార్డులు వెలుగుచూశాయి. అతడి ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా, అనేకమంది పాకిస్థాన్ నంబర్లు, కమ్యూనికేషన్ డేటా బయటపడినట్టు సమాచారం. ఇంతకుముందు హరియాణాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఆమెతో కలిసి సమాచారం మార్చేందుకు ప్రయత్నించినట్లు ఆధారాలున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇక, జ్యోతి మల్హోత్రా విషయానికొస్తే, ఆమె 2023లో పాకిస్థాన్ వెళ్లిన సమయంలో డానిష్‌తో పరిచయం ఏర్పడినట్టు సమాచారం. అనంతరం అక్కడి గూఢచార సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు విచారణలో వెల్లడైంది. అయితే ఆమె ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకుందన్న స్పష్టమైన ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. కానీ, ఆమె ఉద్దేశపూర్వకంగా ISI అధికారులతో టచ్‌లో ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు పంజాబ్‌లో మొత్తం ఏడుగురు వ్యక్తులు పాకిస్థాన్‌కు గూఢచార్యం చేసిన కేసులో అరెస్టు కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ భద్రతా సంస్థలు ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు భారీ స్థాయిలో విచారణ చేపట్టాయి. దేశ భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండేందుకు ఇది పెద్ద హెచ్చరికగా మారింది.
Read Also: Botsa Satyanarayana : వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్పకు అస్వస్థత