Terror Attack : జమ్మూకశ్మీరులోని గండేర్బల్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడికి తమదే బాధ్యత అని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. పాక్ తీవ్రవాద సంస్థ లష్కరే తైబాకు అనుబంధంగా ఇది జమ్మూ కశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ ఉగ్రదాడిలో ఒక డాక్టర్, ఆరుగురు వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి టీఆర్ఎఫ్ చీఫ్ షేక్ సజ్జాద్ గుల్(Terror Attack) అని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ముగ్గురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారని అంటున్నారు. కశ్మీరీయేతరులతో పాటు కశ్మీరీలను కూడా టార్గెట్‌గా చేసుకొని జరిగిన తొలి ఉగ్రదాడిగా దీన్ని చెబుతున్నారు. గత ఏడాదిన్నర కాలంగా కశ్మీరులోని కశ్మీరీ పండిట్లు, సిక్కులు, స్థానికేతరులపై టీఆర్ఎఫ్ దాడులు చేసింది. తాజా దాడితో టీఆర్ఎఫ్ వ్యూహం మారినట్టు స్పష్టమవుతోందని పరిశీలకులు అంటున్నారు.
గండేర్బల్ జిల్లాలో గగనీర్- సోనామార్గ్‌లను కనెక్ట్ చేసే టన్నెల్‌కు సంబంధించిన నిర్మాణ పనులు చేస్తున్న వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వలస కూలీలు తమ పనులన్నీ ముగించుకొని.. సమీపంలోని క్యాంపునకు తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగిందని సమాచారం. ఈ ఉగ్రదాడిలో చనిపోయిన డాక్టర్ కూడా సదరు నిర్మాణ పనుల టీమ్‌లో భాగంగా అక్కడికి వచ్చారని తెలిసింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి. జమ్మూకశ్మీరు డీజీపీ నళిన్ ప్రభాత్ సహా పోలీసు డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఉగ్రదాడిపై సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వలస కార్మికులపై జరిగిన ఉగ్రదాడిని ఆయన ఖండించారు. చనిపోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Also Read :Deepika Kumari : ఆర్చరీ వరల్డ్ కప్.. దీపికా కుమారికి రజతం
ఈ ఏడాది అక్టోబరు 18న జమ్మూకశ్మీరులోని షోపియాన్ జిల్లాలో బిహార్‌కు చెందిన ఒక వలస కూలీని ఉగ్రవాదులు హత్య చేశారు. అంతకుముందు ఏప్రిల్‌లోనూ ఇదే తరహా ఉగ్రదాడి ఒకటి అనంత్‌నాగ్ జిల్లాలో జరిగింది. అప్పట్లో బిహార్‌కు చెందిన ఒక వలస కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.