Pak Army Chief – Kashmir Freedom : ఇవాళ (ఆగస్టు 14) పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం.. ఈసందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రసంగిస్తూ.. కాశ్మీర్ పై విషం కక్కారు. “కాశ్మీర్‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద జైలుగా మార్చింది. కాశ్మీర్ కు ప్రపంచంతో కమ్యూనికేషన్ తెగిపోయింది” అని పాక్ ఆర్మీ చీఫ్ ఆరోపించారు. “త్వరలోనే కాశ్మీర్ ప్రజలకు కూడా స్వేచ్ఛ లభిస్తుంది” అని అసిమ్ మునీర్ కామెంట్ చేశారు. “76 ఏళ్ల క్రితం పాక్ కు స్వాతంత్య్రం లభించినట్లే.. కశ్మీర్ ప్రజలకు కూడా స్వేచ్ఛ లభిస్తుంది” అని పేర్కొన్నారు. “కాశ్మీర్‌పై అంతర్జాతీయ సమాజం దృష్టి పెట్టాలి. మేము కాశ్మీరీలందరితో ఉన్నాం.. వారికి పూర్తిగా మద్దతు ఇస్తాం” అని పేర్కొన్నారు.
ఆదివారం అర్థరాత్రి పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ కాకుల్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(Pak Army Chief – Kashmir Freedom) ఈ వ్యాఖ్యలు చేశారు. “పాకిస్థాన్‌ను నాశనం చేయగల శక్తి ఈ భూమిపై లేదు. తన స్వాతంత్య్రాన్ని ఎలా కాపాడుకోవాలో పాకిస్థాన్‌కు బాగా తెలుసు” అని చెప్పారు. “భారత్ లో ఇప్పుడున్న ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పాక్ కు వ్యతిరేకంగా కొత్తకొత్త వ్యూహాలు రచిస్తోంది. గతంలో మాపై కుట్ర పన్నినప్పుడు ఎలాంటి స్పందన వచ్చిందో అందరూ చూశారు” అని తెలిపారు.