Site icon HashtagU Telugu

Pahalgam : పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ఆదిల్‌కి ప్రభుత్వ గౌరవం

Government Job For Martyr Family

Government Job For Martyr Family

Pahalgam : జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన స్థానిక యువకుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించింది. పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో, వాళ్లను రక్షించేందుకు ప్రయత్నించిన ఆదిల్.. తుపాకీ లాక్కొని ఎదిరించే ప్రయత్నంలో ఉగ్రవాదుల చేతిలో గోలీ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనలో ఆదిల్ చేసిన ధైర్య సాహసాలను గుర్తించిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయన కుటుంబాన్ని కలసి పరామర్శించారు. మరణించిన ఆదిల్ భార్య గుల్నాజ్ అఖ్తర్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ అపాయింట్‌మెంట్ లెటర్‌ను అందజేశారు. దీనిపై బాధిత కుటుంబం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.

పేద కుటుంబంలో పుట్టిన ఆదిల్, ఇంటర్ వరకు చదివాడు. అమర్‌నాథ్ యాత్ర సమయంలో పహల్గాం ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు గైడ్‌గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. యాత్రికులను గుర్రాలపై తీసుకెళ్లి, అక్కడి ప్రదేశాల గురించి వివరిస్తూ ఉండేవాడు. కానీ ఏప్రిల్ 22న ఉగ్రవాదులు అఘాయిత్యానికి పాల్పడటంతో, ఆదిల్ తన ప్రాణాలను పణంగా పెట్టి వారికి అడ్డుగా నిలిచాడు. అయితే ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

ఆ దాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ఆదిల్ అహ్మద్ థోకర్ అనే ఉగ్రవాది ముఖ్య సూత్రధారి అని అధికారులు గుర్తించారు. అతను పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన తర్వాత భారత్‌లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డట్టు సమాచారం. అనంతరం ప్రతీకార చర్యగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపి దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సంఘటనల తర్వాత భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి.

Ahmedabad Plane Crash: ప్రమాదానికి ముందు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు: కేంద్రం