Site icon HashtagU Telugu

91-yr-old Padma awardee evicted: పద్మశ్రీ అవార్డు గ్రహీత రోడ్డు పాలు…!!

Mayadhar Raut

Mayadhar Raut

నృత్యకారుడు రోడ్డు పాలయ్యారు. 90ఏళ్ల ఒడిస్సి కళాకారుడిపై కనికరం లేకుండా… గడువు పూర్తయినా..ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్నారని హఠాత్తుగా ఖాళీ చేయించడంతో ఆయన నడిరోడ్డున పడ్డారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రానికి కళాకారులంటే గౌరవం లేదని నృత్యకారుడి కుమార్తె మండిపడుతున్నారు.

ప్రముఖ నృత్యకారుడు గురు మయధర్ రౌత గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలోని ఏషియన్ గేమ్స్ విలేజీలో ప్రభుత్వం కేటాయించిన ఒక వసతి గృహంలో ఉంటున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రముఖ కళాకారులకు చాలా సంవత్సరాల క్రితమే ఈ వసతులు కేటాయించగా…వీటిని 2014లో రద్దు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో వారంతా కోర్టును ఆశ్రయించారు. అయినప్పటికీ ఫలితం లేదు. దీంతో వీరిలో చాలా మంది తమ బంగ్లాలను ఖాళీ చేశారు. మిగిలినవారు ఏప్రిల్ 25లోగా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే మయధర్ రౌత్ వెళ్లకపోవడంతో అధికారులే స్వయంగా ఇళ్లు ఖాళీ చేయించారు. ఇంట్లోని ఫర్నిచర్ ను వీధిలోపెట్టారు. దీంతో ఆ కళాకారుడు నడిరోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కార పత్రం కూడా రోడ్డుపై కనిపించడంతో వైరల్ గా మారింది. దీంతో కేంద్రం తీరుపై పెద్దెతున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మయధర్ కుమార్తె మధుమితా రౌత్ ఈ ఘటనపై తీవ్రంగా మండిపడ్డారు. బంగ్లా ఖాళీ చేయించడం చట్టపరంగా సరైందే కావచ్చు..కానీ అధికారులు ప్రవర్తించిన తీరు చాలా అవమానీయంగా ఉందని మండిపడ్డారు. కళాకారుల పట్ల మోదీ సర్కార్కు ఎలాంటి గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.