Site icon HashtagU Telugu

Assam Floods: అయ్యో పాపం…వరదలతో 5వందల కుటుంబాలు రైలు పట్టాలపైనే…అస్సాంలో దారుణ పరిస్థితులు..!!

Floods Assam

Floods Assam

భారీ వరదలతో అస్సాం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయినట్లుగా కనిపిస్తోంది. వర్షాలు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. అందులో భాగంగానే జముణముఖ్ జిల్లాలోని రెండు గ్రామాలకు చెందిన దాదాపు 500కుటుంబాలు రైల్వే ట్రాక్ లపైనే నివసిస్తున్నాయి. ఆ ప్రాంతమంతా వరద నీటిలో మునిగిపోయింది. ఒక రైలు పట్టాలు మాత్రమే సురక్షితంగా ఉండటంతో…స్థానికులు అక్కడే తలదాచుకుంటున్నారు.

కాగా చాంగ్ జురై, పాటియా పత్తర్ గ్రామాల ప్రజలు వరదల కారణంగా సర్వస్వం కోల్పోయారు. టార్పాలిన్ షీట్లతో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. ఐదురోజులుగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నుంచి తమకు ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం లేక అమానీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారు.

మూడు రోజులుగా ఎలాంటి పై కప్పు లేకుండా ఉంటున్నాము. కొంత డబ్బును అప్పు తీసుకుని టార్పాలిన్ షీట్స్ కొన్నాం. ఒక షీట్ కింద ఐదు కుటుంబాలు తలదాచుకుంటున్నాం. మాకు ఎలాంటి ప్రైవసీ లేదని మోన్వారా బేగం అంటున్నారు.

ప్రకృతి వైపరీత్యాల కారణం వల్ల అస్సాం రాష్ట్రంలోని 29 జిల్లాల్లోని 2,585 గ్రామాల్లో 8 లక్షల మందికి పైగా ప్రజల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. రుతుపవనాలకు ముందు వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14మంది మరణించారని అధికారులు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 343 సహాయక శిబిరాల్లో 86,772మంది తలదాచుకుంటున్నారు. మరో 411 సహాయ పంపిణీ కేంద్రాలు కూడా వీరికి సహాయం చేస్తున్నాయి. ఆర్మీ పారామిలిటరీ బలగాలు, జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయక దళాలు పడవలు, హెలికాప్టర్ల ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలనుంచి 21వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.