ఆడవాళ్లు కదా.. తేలిగ్గా తీసిపారేయలేం.. తమకంటూ లక్ష్యాలను నిర్దేశించుకొని.. వాటికి అనుగుణంగా కష్టపడుతున్నారు. అవకాశాల్లో సగం.. ఆకాశాల్లోనూ సగం అంటూ దూసుకుపోతున్నారు. కష్టసాధ్యమైన విమానయాన రంగంలో రాణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్‌లైన్ పైలట్స్’ ప్రకారం భారతదేశంలో, మహిళా పైలట్ల సంఖ్య గణనీయంగా ఉంది. ఇది 15 శాతానికి పైగా ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వికె. సింగ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంలో తెలిపారు.
అమెరికా, ఆస్ట్రేలియా సహా చాలా పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో మహిళా పైలట్ల శాతం రెండింతలు ఎక్కువగా ఉందని ఓ నివేదిక పేర్కొంది. అయితే మహిళా పైలట్లపై ప్రభుత్వ ఎయిర్ ఇండియా వివక్ష చూపుతోందని ‘ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్’ ఇటీవల ఆరోపించింది. ఒక నివేదిక ప్రకారం, అప్‌గ్రేడేషన్ జాబితాలో ప్రసూతి సెలవులు తీసుకున్న కొంతమంది మహిళా పైలట్‌ల పేర్లను మినహాయించారని లేదా తప్పుగా స్పెల్లింగ్ చేశారని, తద్వారా లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) లాంటి సేవా ప్రయోజనాలను తిరస్కరించడం, వాళ్ల సీనియారిటీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని అసోసియేషన్ తెలిపింది. ‘విమెన్ ఇన్ ఏవియేషన్ ఇంటర్నేషనల్’ (WAI) ఇండియా చాప్టర్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు, ప్రముఖ మహిళా విమానయాన నిపుణుల సహకారంతో దేశవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని, ముఖ్యంగా యువ పాఠశాల బాలికలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి తెలిపారు.
దేశంలో పైలట్ల శిక్షణను ప్రోత్సహించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, దాని అనుబంధ సంస్థలు అనేక చర్యలు తీసుకున్నాయి. అయితే FTOల వద్ద విమాన ప్రయాణ వేళలను, సంవత్సరానికి జారీ చేయబడిన కమర్షియల్ పైలట్ లైసెన్స్ సంఖ్యను పెంచే అవకాశం ఉంది. మహిళా పైలట్లతో సహా ఔత్సాహిక పైలట్లందరకీ ఇవి ప్రయోజనం చేకూరుస్తాయి.