Site icon HashtagU Telugu

Twitter Ownership: ట్విట్టర్ ఓనర్ మారొచ్చు.. కానీ రూల్స్ మాత్రం మారవు: కేంద్రం

elon musk

elon musk twitter

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం దేశం నిబంధనలకు ట్విట్టర్ కట్టుబడి ఉండాలని, ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ దక్కించుకోవడంతో నియమ, నిబంధనలు మారవని కేంద్ర సీనియర్ మంత్రి ఒకరు తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాలు ద్వేషం, విభజన ఆలోచనలకు వేదికలు కాకుండా చూడాల్సిన బాధ్యత తనపై ఉందని మస్క్ అన్నారు. సంస్థను సొంతం చేసుకున్న వెంటనే సీఈఓ, సీఎఫ్‌ఓలను పదవుల నుంచి తొలగించారు కూడా. తనను తప్పుదారి పట్టించినందుకే వారిపై వేటు పడిందని మస్క్ చెప్పుకొచ్చారు. సాంకేతికతంగా ట్విట్టర్‌లోని లోపాలను అధిగమించాల్సి ఉందన్నారు.

ట్విట్టర్ యాజమాన్య హక్కులను ఎలాన్‌ మస్క్‌ దక్కించుకున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. యాజమాన్యం మారినా ట్విట్టర్ పై విధించిన నియమ, నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అన్ని సోషల్‌ మీడియా సంస్థలకు ఇదే వర్తిస్తుందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. మస్క్‌ ఎంట్రీతో నిషేధానికి గురైన పలు వివాదాస్పద అకౌంట్లు మళ్లీ యాక్టివ్‌ అవుతాయని టాక్‌ వస్తున్న నేపథ్యంలో కేంద్రం చేసిన ఈ ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న వెంటనే టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లపై వేటు వేశారు. ట్విట్టర్ డీల్‌తో ప్రపంచంలోనే అతి పెద్దదైన సోషల్ మీడియా చర్చా వేదిక మస్క్ చేతికి చిక్కింది. ట్విట్టర్ కొనుగోలు విషయంలో ఈ నెల 28 లోపు ఏదో ఒక నిర్ణయానికి రావాలంటూ కోర్టు తుది గడువు విధించిన నేపథ్యంలో ట్విట్టర్‌ను మస్క్ 44 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నారు. వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్ఓ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దెపై మస్క్ వేటు వేసిన విషయం తెలిసిందే.

Exit mobile version