Oscar Pinki – House Demolition : ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లా రాంపూర్ ధాభి గ్రామానికి చెందిన ‘స్మైల్ పింకీ’ చాలా ఫేమస్. ఎంతగా అంటే.. ఆమె నటించిన ‘స్మైల్ పింకీ’ డాక్యుమెంటరీకి 2008వ సంవత్సరంలో ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. పింకి సోంకర్ జీవితం ఆధారంగానే ఈ డాక్యుమెంటరీని తీశారు. ఇప్పుడు ఆమె పేరు మళ్లీ వార్తల్లోకి రావడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేమిటంటే.. పింకీ సోంకర్ కుటుంబం నివసించే చిన్నపాటి ఇంటిని కూల్చేస్తామంటూ ఉత్తరప్రదేశ్ అటవీశాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. పింకీతో పాటు ఆమె ఊరు రాంపూర్ ధాభిలో నివసిస్తున్న 30 మందికి ఈవిధంగా సెప్టెంబరు 21న కూల్చివేత నోటీసులు అందజేశారు. అడవికి చెందిన స్థలంలో కట్టుకున్నందున ఈ ఇళ్లను కూల్చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ ఇళ్లను అధికారులు అక్రమ ఆస్తులుగా అభివర్ణించారు.
Also read : International Translation Day : ప్రపంచాన్ని ఏకం చేసిన ‘అనువాద’ విప్లవం
‘‘పింకీ తీసిన డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత అటవీశాఖ అధికారులు ఈ భూమిని మాకు ఇచ్చారు. ఆ తర్వాతే ఇక్కడ ఇళ్లను కట్టుకున్నాం’’ అని పింకీ సోంకర్, ఇతర బాధిత కుటుంబాల వారు మీడియాకు తెలిపారు. ‘‘మేం ఇళ్లు నిర్మించుకునేటప్పుడు అటవీ అధికారులు .. ఇది ఫారెస్ట్ ల్యాండ్ అనే విషయాన్ని మాకు చెప్పలేదు’’ అని పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ చెప్పారు. ఈనేపథ్యంలో పింకీ కుటుంబానికి జారీచేసిన కూల్చివేత నోటీసును పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని, న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని మీర్జాపూర్ కలెక్టర్ ప్రియాంక నిరంజన్ వెల్లడించారు. దీనికి న్యాయబద్ధమైన పరిష్కారాన్ని అన్వేషిస్తామని.. ఇప్పటికే రెవెన్యూ, అటవీ శాఖలకు సమాచారం అందించామని (Oscar Pinki – House Demolition) తెలిపారు.