పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ

కేంద్రం తాజాగా అందించిన పద్మ అవార్డులతో ఎంతో మంది సామాన్య వ్యక్తులు బయటప్రపంచానికి పరిచయమయ్యారు. అందులో ఒకరే రోడ్లపై పండ్లు అమ్ముకునే హరేకల హజబ్బా. 68ఏండ్ల హజబ్బా మంగళూరు నగరంలో పండ్లు అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నాడు.

కేంద్రం తాజాగా అందించిన పద్మ అవార్డులతో ఎంతో మంది సామాన్య వ్యక్తులు బయటప్రపంచానికి పరిచయమయ్యారు. అందులో ఒకరే రోడ్లపై పండ్లు అమ్ముకునే హరేకల హజబ్బా. 68ఏండ్ల హజబ్బా మంగళూరు నగరంలో పండ్లు అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నాడు.

పండ్లు అమ్మితే వచ్చే సంపాదనతో పేద విద్యార్థుల కోసం పాఠశాల నిర్మించి ఎంతో మందికి ఆదర్శమయ్యారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం హజబ్బాను పద్మశ్రీతో సత్కరించింది.

హరేకల హజబ్బా నిరక్షరాస్యుడు. ఒకసారి ఓ విదేశీ జంట హజబ్బా వద్దకు వచ్చి ఆంగ్లంలో పండ్ల ధర ఎంత అని అడిగారు. ఆయనకు ఇంగ్లీష్‌ రాదు దీంతో కన్నడలో సమాధానం చెప్పారు. అది వారికి ఎంతకీ అర్థం కాకపోవడంతో ఆ జంట విసుగుపుట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ ఘటనతో హజబ్బా ఎంతగానో కుమిలిపోయారు. తాను చదువుకొని ఉంటే ఇలా జరిగే ఉండేది కాదని బాధపడ్డారట.

Also Read : చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే

ఆ సంఘటనతో చదువు విలువ తెలుసుకున్న హజబ్బా తనలా మరెవరూ అలా బాధపడొద్దని నిర్ణయించుకొని తన సంపాదనలో కొంచెం కొంచెం పక్కనపెట్టి ఆ డబ్బుతో 2000 సంవత్సరంలో కొంతమంది పేద విద్యార్థులతో స్థానికంగా ఉన్న మదర్సాలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో పాఠశాల నిర్మించాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం తన సంపాదనలో దాచుకున్న సొమ్ముతో పాఠశాల నిర్మాణానికి కావలసిన ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇతర దాతలు నుంచి విరాళాలు సేకరించి, ప్రభుత్వ అధికారుల సహాయంతో తన గ్రామంలో పాఠశాల నిర్మించారు. ఇప్పటికీ రోజూ ఆ పాఠశాల ఆవరణను హజబ్బా శుభ్రం చేస్తారు. విద్యార్థుల కోసం తాగునీటి వసతిని కూడా కల్పించారు.

హజబ్బా సేవలను మెచ్చి కర్ణాటక ప్రభుత్వం ఎన్నో పురస్కారాలు అందించింది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించిన విషయాన్ని తొలుత హజబ్బా నమ్మలేదట. రేషన్‌ షాపు ముందు క్యూలో ఉన్న తన దగ్గరికి దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయ సిబ్బంది వచ్చి తనకి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించినట్లు తెలిపారని, తనకి నమ్మబుద్ధి కాలేదని, అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని హజబ్బా తెలిపారు.