TV Anchors : టీవీ యాంకర్లపై ప్రతిపక్షాల బహిష్కరణ సంచలనం

తాజాగా 14 మంది టీవీ యాంకర్లను (TV Anchors) ప్రతిపక్షాల కూటమి ఇండియా (INDIA) బహిష్కరించింది.

  • Written By:
  • Updated On - September 16, 2023 / 02:44 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Boycotting of TV Anchors : సంఘ సంస్కరణకు ఒక పత్రిక అవసరం అని కందుకూరి వీరేశలింగం పంతులుగారు అప్పట్లో వివేకవర్ధిని అనే పత్రికను నడిపారు. ఆ పత్రిక మొదటి పేజీలో పై భాగంలో ప్రముఖంగా కనిపించేటట్లు మహాభారతంలోని ఒక పద్యాన్ని ప్రచురించేవారు. ఆ పద్యం ఇది. “ ఒరులేయవి ఒనరించిన అప్రియంబు తన మనంబునకగు, తానొరులకు అవి సేయకునికి పరాయణము సర్వ ధర్మ పథమలకెల్లన్”. ఈ పద్యానికి అర్థం ఏంటంటే, ఇతరులు చేసే ఏ పనులు మన మనసుకు అయిష్టమైనవో ఆ పనులను ఇతరుల పట్ల మనం చేయకూడదు.

అదే సర్వధర్మాలలోనూ సర్వోత్కృష్టమైనటువంటిది. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేశంలో మీడియా పోషిస్తున్న పాత్ర పెద్ద చర్చనీయాంశమైంది. తాజాగా 14 మంది టీవీ యాంకర్లను (TV Anchors) ప్రతిపక్షాల కూటమి ఇండియా (INDIA) బహిష్కరించింది. దీనిపై అధికార పక్షం బీజేపీ భగ్గుమంది. ఇక ఆ యాంకర్లు సరేసరి. ఇరుపక్షాల వారూ ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.

గత బుధవారం నాడు ప్రతిపక్ష ఇండియా కూటమి ఆర్డినేషన్ కమిటీ సమావేశమై, ద్వేషాన్ని రెచ్చగొడుతున్న టీవీ యాంకర్ల మీద చర్య తీసుకోవలసిందిగా మీడియా సబ్ కమిటీకి ఆ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరె ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి ప్రతిపక్షాల కూటమి ఇండియా, 14 మంది టీవీ యాంకర్లను (TV Anchors) బహిష్కరిస్తున్నట్టు చెప్పడమే కాకుండా వాళ్ళ పేర్లను కూడా బహిరంగపరిచారు. ఎందుకు వారిని తాము బహిష్కరిస్తున్నామో కూడా ఆయన వివరించారు.

తాము బహిష్కరించిన ఈ యాంకర్లు రోజూ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టే పని చేస్తున్నారని, ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలయితే చాలు, వారు తమ టీవీల్లో నఫ్రత్ కా బజార్ అంటే విద్వేషాల దుకాణాలు తెరిచి కూర్చుంటారని, ఇట్లాంటి మీడియా వ్యవహారం దేశానికి హానికరమని కాంగ్రెస్ పార్టీ మిగిలిన ప్రతిపక్షాల పార్టీల వాదన. తాము కేవలం ఫలానా యాంకర్ల షోలు మాత్రమే బహిష్కరిస్తున్నామని ఆ టీవీలను, ఆ ఛానళ్ళను కాదని, ఆ యాంకర్లు నిర్వహించే కార్యక్రమాలలో చర్చాగోష్టులలో తమ పార్టీల ప్రతినిధులు పాల్గొనబోరని, ఆ చానల్స్ లో ఇతర కార్యక్రమాలలో తమ వారు పాల్గొంటారని, ఇది కేవలం దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రక్రియను అడ్డుకోవడానికి చేసిందే గాని ఏ వ్యక్తులకూ ఏ సంస్థలకూ వ్యతిరేకమైంది కాదని ప్రతిపక్షాల కూటమి వాదన.

ఇంతకీ ఎవరా 14 మంది యాంకర్లు?

రిపబ్లిక్ టీీవీ నెట్ వర్క్ కి చెందిన అరణవ్ గోస్వామి, ఆజ్ తక్ కి చెందిన సుధీర్ చౌౌదరి, న్యూస్ 18(హిందీ) కి చెందిన అమిష్ దేవగణ్, టైమ్స్ నౌ కి చెందిన నావికా కుమార్,ఇండియా టుడే గ్రూప్ కి చెందిన గౌరవ్ సావంత్ ప్రముఖంగా ఉన్నారు. వీరితో పాటు వివిధ ఛానల్స్ కి చెందిన అదితి త్యాగి, అమన్ చోప్రా, ఆనంద్ నరసింహన్,అశోక్ శ్రీవాస్తవ్,చిత్రా త్రిపాఠి,ప్రాచీ పరాశర్,రూబికా లియాక్వత్, శివ్ అరూర్, సుశాంత్ సిన్హా ఉన్నారు.నేషనల్ మీడియాను రోజూ ఫాలో అవుతున్న వారికి రోజూ ఈ యాంకర్ల్ షోలు ఎలా ఉంటాయో పరిచయమే. ప్రభుత్వం పట్ల వారి అపర విధేయతకు క్విడ్ ప్రోకోగా ప్రభుత్వం నుంచి అందాల్సిన పారితోషికాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సకాలంలో అందుతుంటాయి.

అయితే దీని పట్ల సహజంగానే అధికార బిజెపి వర్గాల నుంచి ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు తీసుకున్న ఈ చర్య మీడియా స్వేచ్ఛా స్వతంత్య్రాలకు సంకెళ్లు వేయడమేనని, కొందరు యాంకర్లను టార్గెట్ చేయడం అంటే వారిని హిట్ చేయడమేనని, వారి హిట్ లిస్ట్ ప్రకటించడం ద్వారా వారిపై దేశంలో ద్వేషం రెచ్చగొట్టడమేనని, ఇది పత్రికా స్వేచ్ఛకు, ఉనికికి అత్యంత ప్రమాదకరమని బిజెపి వారు వాదిస్తున్నారు, అంతా సరే కానీ, ఎవరు ఏం మాటలు చెబుతున్నారో.. తాము ఇదే విషయం మీద గతంలో ఎవరి పట్ల ఏం చేశామో అనేది గమనించాలి. వారు గమనించకపోయినా దేశం గమనిస్తూనే ఉంది. గతంలో అనేక మీడియా సంస్థల మీద అంకుశం వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

బిజెపి అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్ళ కాలంలో చిన్న చిన్న ఇండిపెండెంట్ జర్నలిస్టుల నుంచి, పెద్దపెద్ద మీడియా సంస్థల దాకా సంకెళ్లు వేసి నోళ్లు మూయించి అవసరమైతే జైళ్లలో పెట్టి మీడియా స్వేచ్ఛను హరించిన సందర్భాలు కోకొల్లలు. ఎందరో జర్నలిస్టులు ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నారు. చిన్న అల్లరి చెలరేగినా అక్కడ ఇంటర్నెట్ బంద్ పెట్టి మీడియా నోటికి తాళం తగిలించే వారు ఇలా ఆగ్రహిస్తే ఎలా చెప్పండి అని విపక్షాలతో పాటు, స్వతంత్ర మీడియా నడుపుతున్న జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

కాబట్టి ఇతరులు చేసింది ఏది తమకు నచ్చదో ,ఆ పని ఇతరుల పట్ల మనం చేయకూడదనేదే మహాభారతంలో పైన నేను పేర్కొన్న ఆ పద్యానికి అర్థం. మహానుభావులు కందుకూరి వీరేశలింగం లాంటి సంఘసంస్కర్తలు ఇప్పుడు ఎక్కడున్నారు? సత్యం కోసం పత్రికలు నడిపిన మహాత్మా గాంధీలు ఎక్కడ? మీడియా గురించి మీడియా స్వేచ్ఛ గురించి స్వచ్ఛమైన స్వతంత్రమైన వార్తా కథనాల గురించి ఆలోచించే తీరుబడి, చిత్తశుద్ధి ఇప్పుడు ఎంతమందికి ఉంది? పైన పేర్కొన్న 14 మంది యాంకర్లు అధికారంలో ఉన్న పెద్దలకు దాసోహమైపోయి, రాజు చేసిన ఏ పనైనా అది ఒక మహత్తర ధర్మకార్యమేనని, ప్రతిపక్షాలు చేసిన ఏ పనైనా అది దేశద్రోహమేనని పలు రకాలుగా చిత్రీకరించడానికి పాట్లు పడుతుంటారు.

అధికారంలో ఉన్నవారు అవినీతికి పాల్పడినా అది దేశాభివృద్ధిలో భాగమేనని, ప్రతిపక్షాలు చిన్న విమర్శ చేసినా అది విద్రోహ చర్యేనని చిత్రీకరించడానికి మీడియా తంటాలు పడుతున్నంతకాలం ఇలాంటి ఆరోపణలు, బహిష్కరణలు ఎదుర్కోవాల్సిందే. స్వతంత్ర మీడియా అంటే అధికార పక్షానికో ప్రతిపక్షానికో కొమ్ము కాయడం కాదు. సువిశాలమైన దేశంలోని కోట్లాది ప్రజల పక్షం వహించి నిజాన్ని నిగ్గు తేల్చడమే పరమధ్యేయంగా మీడియా పెట్టుకోవాలి. అప్పుడే ఈ ఆరోపణలు బహిష్కరణలు ఉండవు. అంతవరకు ఈ దేశంలో ఇలాంటివి చూడడం తప్పదు మరి.

Also Read:  YS Sharmila – Sonia Gandhi : నేడు సోనియాతో షర్మిల భేటీ.. వైఎస్సార్టీపీ విలీనంపై ప్రకటన ?