తవాంగ్ సెక్టార్‌లో భారత్-చైనా సైనిక ఘర్షణ వ్యవహారంపై పార్లమెంట్‌లో దుమారం కొనసాగుతోంది. చైనా (China) విషయంపై చర్చించాలంటూ రాజ్యసభలో కేంద్రాన్ని డిమాండ్ చేశాయి విపక్షాలు. ఛైర్మన్ ఒప్పుకోలేదని వాకౌట్ చేశాయి. అయితే చైనా(China)తో సరిహద్దు వివాదంపై విపక్షాల విమర్శలకు కేంద్రం దీటుగా బదులిచ్చింది. ఈ వ్యవహారంలో ఉదాసీనంగా ప్రవర్తించడం లేదని స్పష్టంచేసింది. సరిహద్దులో సాధారణ పరిస్థితి కోసం డ్రాగన్‌పై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని తేల్చిచెప్పింది. విపక్షాల విమర్శలకు లోక్‌సభలో కౌంటర్ ఇచ్చారు విదేశాంగ మంత్రి జైశంకర్.
సైన్యాన్ని ఎవరూ అగౌరవపర్చకూడదన్నారు. చైనా సమస్యను విదేశాంగ మంత్రి లోతుగా అర్థం చేసుకోవాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు . అంతకుముందు, చైనా అంశంపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. రూల్ 267 కింద 9 నోటీసులు ఇవ్వగా.. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు నిరసన తెలిపాయి. మిగిలిన అంశాలను పక్కన పెట్టి చర్చించాల్సిందేనని పట్టుబట్టాయి. చైనా మన భూమిని ఆక్రమిస్తోందని..ఈ సమస్యపై కాకుండా.. ఇంకేం చర్చిస్తామని నిలదీశారు రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే. అయినప్పటికీ సభాపతి అనుమతించలేదు. దీంతో కాంగ్రెస్, ఆప్, ఆర్జేడీ, డీఎంకే, సమాజ్వాదీ, ఎన్సీపీ, వామపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
Also Read: Karnataka : కర్ణాటకలో దారుణం.. స్టూడెంట్‌ని కొట్టి చంపిన టీచర్
రాజ్యసభలో విపక్షాల తీరుపై ఆభ్యంతరం వ్యక్తం చేశారు సభా నాయకుడు, కేంద్రమంత్రి పీయూష్ గోయల్. జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ సభా కార్యకలాపాలను అడ్డుకునే విధానాలను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. 2004 నుంచి 2014 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సున్నితమైన అంశాలపై చర్చను పార్లమెంటు అంగీకరించలేదని గుర్తుచేశారు గోయల్. కాంగ్రెస్ రాజకీయాలు మరీ దిగజారిపోయాయని ధ్వజమెత్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ఈనెల 9న చైనా, భారత జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. స్టేటస్ కోను మార్చేందుకు యత్నించిన డ్రాగన్ సైన్యాన్ని ఇండియన్ ఆర్మీ తరిమికొట్టింది.