BJP : బిజెపి వలలో పడ్డ ప్రతిపక్షాలు

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 07:19 PM IST

డా. ప్రసాదమూర్తి

మనం అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండగానే దేశం మొత్తం కాషాయ రంగు కప్పుకుంటోంది. మతాన్ని, రాముణ్ణి తమ రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి వారు వాడుకుంటున్నారని నిత్యం విమర్శలు గుప్పించే ప్రతిపక్షాలు, మరో దారి తోచక ఆ మత రాజకీయాలనే పట్టుకొని గిలగిలా కొట్టుకుంటున్నారని అనిపిస్తోంది. హిందువులు వేరు హిందుత్వం వేరు. కొన్ని ధార్మిక సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలు హిందుత్వం పేరుతో రాజకీయం చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. మరి దాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఏ వ్యూహాలు అనుసరిస్తున్నాయి.. వారి ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి.. అఖండ భారతానికి, ముఖ్యంగా అశేష హిందూ జన సందోహానికి వారు చూపించే ధర్మ మార్గం ఏమిటి అనే ప్రశ్నలకు ప్రతిపక్షాల వద్ద సమాధానం ఏమీ ఉన్నట్టు కనిపించడం లేదు. సమాధానం ఏమైనా ఉంటే అది ఒకటే. వారు కూడా మరో రకమైన హిందుత్వ ప్రచారంలో మునిగిపోవడమే. బిజెపి వారు విసిరిన ట్రాప్ లో ప్రతిపక్షాలు ఎంతగా ఇరుక్కుపోయాయో ఇటీవల కొందరు విపక్ష నాయకుల చర్యలు, కార్యక్రమాలు చూస్తుంటే అర్థమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ప్రతినెలా ఒక మంగళవారం రామాయణంలోని సుందరకాండ పఠనం, హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నారు. మాకు రామాయణం పట్ల.. హిందూ మతం పట్ల.. హిందూ దేవతల పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు ఉన్నాయని ప్రకటించుకోవడానికే ఈ కార్యక్రమాలు. మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున చేస్తున్నారా.. పార్టీ తరపున చేస్తున్నారా.. దీనికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తున్నారు అనేది తెలియదు. అయితే వీళ్ళు చేస్తున్నది నరేంద్ర మోడీ చేస్తున్న దాని కంటే విరుద్ధమైనది ఏమీ కాదు. ఇక కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారే నేనంటే నేను గొప్ప హిందూ మత వాదిని అని చెప్పుకోవడానికి సాగించిన ప్రయత్నాలు కోకొల్లలు. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్, ఛత్తీస్గడ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆకాశమంత హనుమాన్ విగ్రహం గురించి, సీతా మందిరం గురించి, రామాయణ కల్చరల్ హెరిటేజ్ గురించి గొప్ప గొప్ప వాగ్దానాలు చేసిన విషయం మనం మర్చిపోలేదు. ఇప్పుడంటే రాహుల్ గాంధీ తెలివి తెచ్చుకుని, మతం వ్యక్తిగతమైందని దాన్ని పబ్లిక్ చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొందరు చూస్తున్నారని మాట్లాడుతున్నారు గాని, ఆయన భారత్ జోడో యాత్ర సందర్భంగా ఇతర సందర్భాల్లోనూ అనేక దేవాలయాల్లో ప్రవేశించి పూజలు చేసిన దృశ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇదంతా తాను పరమ హిందూ భక్తుడిని అని చెప్పుకోవడానికే కదా.

ఇకపోతే రామ మందిరం ప్రారంభోత్సవానికి తాను వెళ్లడం లేదని ప్రకటించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ సమయంలో తాను కూడా ఘనమైన ధార్మిక కార్యక్రమాలను చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ సమాజ్వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ జనవరి 22 తర్వాత అయోధ్య వెళ్లి రామ మందిరాన్ని కుటుంబంతో సహా దర్శించుకుంటానని అన్నాడు. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉద్ధవ్ ఠాక్రే ఇలా పలువురు ప్రతిపక్ష నాయకులు వారి వారి మార్గాల్లో తమ హిందుత్వ రూపాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి తంటాలు పడిన దృశ్యాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ మధ్యనే ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జగన్నాథ కల్చరల్ హెరిటేజ్ కారిడార్ను ప్రారంభించారు. దీనికి దాదాపు 100 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇలా ప్రతిపక్షాలన్నీ ఎవరికి వారు తామంతా హిందువులమేనని, హిందూ దేవీ దేవతల భక్తులమేనని చెప్పుకోవడానికి నిరంతర ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. వారు హిందువులే అన్న విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కానీ బిజెపి వారు చేస్తున్న దాన్ని వీరు మరో రకంగా అనుసరించడమే పలు సందేహాలకు తావిస్తోంది. ఇదంతా వీరు దేనికి చేస్తున్నట్టు? మతం వ్యక్తిగతమైనదని వారు ఒకపక్క చెబుతూనే తమ మత కార్యక్రమాలను దేశానికి ఎందుకు చాటి చెప్తున్నారు? అంటే హిందూ మతానికి కేవలం బిజెపి వారు, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వారు మాత్రమే కాదు తాము కూడా గొప్ప ప్రతినిధులమేనని చాటి చెప్పుకోవడానికి కదా. ఇక అలాంటప్పుడు అందరూ చేసే పని ఒకటే అయితే విడివిడి పార్టీలు, ఈ విడివిడి తగాదాలు దేనికి? అందరూ కలిసి రామాయణ గాథ ఆలపిస్తూ దేశమంతా తిరిగితే సరిపోతుంది కదా అనే అనుమానం కూడా మనకు కలుగుతుంది. బిజెపి నాయకులు తాము మాత్రమే రామభక్తులమని, హిందూ మతానికి తామే కవచకుండలాలమని ప్రకటించుకుంటున్న నేపథ్యంలో వారిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు తిరిగి అదే మత రాజకీయాలను తమ అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ఈ ధోరణి విపక్షాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో గానీ, అధికారపక్షమైన బిజెపికి సంపూర్ణంగా లాభపడుతుందని చెప్పాలి.

తాము కూడా హిందూ భక్తులమేనని నంగి నంగి మెతక వైఖరితో చెప్పే నాయకుల కంటే తామే నిజమైన హిందూ నేతలం అని బాహాటంగా ప్రకటించుకునే వారి పట్లనే హిందూ సమాజానికి భక్తి కుదురుతుంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు, మతాన్ని రాజకీయం చేస్తున్న వారిని ఎదుర్కోవడానికి తిరిగి ఆ మతాన్నే అస్త్రంగా వాడుకోవడం ఏ మాత్రం లాభసాటి వ్యవహారం కాదని గమనించలేకపోతున్నాయి. అందుకే బీజేపీ వారు విసిరిన మతం వలలో విపక్షాలు గిలగిలా కొట్టుకుంటున్నాయని చెప్పాలి. మతాన్ని మతంతో గాని, మత రాజకీయాలను మత రాజకీయాలతో గానీ ఎవరూ ఎదుర్కోలేరు. తాము లౌకిక విలువలకు కట్టుబడి ఉన్నామని చెప్పుకునేవారు ఆ లౌకిక భావాలను ప్రచారం చేస్తూ కలిసికట్టుగా ముందుకు సాగడమే ప్రతిపక్షాల ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం. అప్పుడే లౌకికత్వంతో హిందుత్వాన్ని ఢీకొనగలుగుతారు. లేకుంటే అందరూ చేసేది హిందూ రాజకీయాలే అయితే అదే పని మరింత బాహాటంగా ఆర్భాటంగా ధైర్యంగా చేసే బిజెపి వారికే ప్రజలు పట్టం కడతారంటే అతిశయోక్తి కాదు.

Read Also : YS Sharmila : షర్మిల ఎంట్రీ ఎవరికి లాభం?