PM Modi : భోపాల్‌లో జరిగిన ‘మహిళా స్వశక్తికరణ్ మహా సమ్మేళన్’లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పహల్గాంలో ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు. భారతీయ నారీశక్తిని లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడి, వారి వినాశనానికి కారణమైందని మోడీ వ్యాఖ్యానించారు. పహల్గాంలో జరిగిన దాడి కేవలం భారతీయ పౌరులపై కాక, మన సంస్కృతి, విలువలపై కూడా జరిగిన దాడి. కానీ, ఆ సవాలును మన మహిళా యోధులు గర్వంగా ఎదుర్కొన్నారు అని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులపై జరిగిన ప్రతీకార దాడుల్లో భారత మహిళా అధికారిణుల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తాపించారు. మహిళా బలగాలు ఉగ్రవాదుల చాపిన పన్నాగాలను ధ్వంసం చేశాయని, దేశానికి గర్వకారణంగా నిలిచాయని పేర్కొన్నారు.
Read Also: Bhatti Vikramarka: ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం: భట్టి విక్రమార్క
ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ నుంచి వచ్చిన దాడుల సమయంలో, బీఎస్‌ఎఫ్‌కి చెందిన మహిళా బృందం అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలో మూడు రోజుల పాటు అఖ్నూర్ ప్రాంతంలో పోరాటం చేయడాన్ని మోదీ అభినందించారు. ఈ పోరాటంలో భారత కుమార్తెల బలం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అని మోడీ గర్వంగా ప్రకటించారు. ఉగ్రవాదాన్ని పోషించే శక్తులు కూడా ఈ ప్రతీకార దాడులతో గట్టి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ప్రధాని హెచ్చరించారు. పాకిస్థాన్ సైన్యానికే ఊహించనంత లోతైన ప్రాంతాల్లోని ఉగ్ర శిబిరాలపై మన సైన్యం జరిపిన దాడులు, భారత చరిత్రలో మైలురాయి అని మోడీ పేర్కొన్నారు. సింధూర్ అంటే మన సంప్రదాయంలో నారీశక్తికి ప్రాతినిధ్యం. అదే సింధూర్ ఇప్పుడు దేశ రక్షణకు మార్గదర్శకంగా మారింది అని వ్యాఖ్యానించారు.
ఈ మహా సమ్మేళన్ సందర్భంగా ప్రధాని మోడీ, ఇందౌర్‌ర్ మెట్రో ప్రాజెక్ట్‌తో పాటు దాటియా, సత్నా విమానాశ్రయాల సూపర్ ప్రియారిటీ కారిడార్లను వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే, రూ.483 కోట్ల వ్యయంతో నిర్మించిన అటల్ గ్రామ సేవా సదనాల తొలి విడత నిధులను విడుదల చేశారు. అంతేగాక, 18వ శతాబ్దపు మాల్వా ప్రాంతాన్ని పరిపాలించిన రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతిని పురస్కరించుకుని ఆమెకు అంకితంగా పోస్టల్ స్టాంప్ మరియు రూ.300 స్మారక నాణాన్ని ప్రధాని ఆవిష్కరించారు. రాణి అహల్యాబాయి పాలనలో సామాజిక సంక్షేమం, సౌమ్యత్వం, ధైర్యం మేళవించి ఉండేవి. ఆమె జీవితం నేటి మహిళలకు మార్గదర్శిగా నిలుస్తుంది అని మోడీ కొనియాడారు.