Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1:05 గంటల నుండి 1:30 గంటల వరకు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని, పాకిస్తాన్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు నిర్వహించింది. జైషే మహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన మొత్తం తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మూడు ఉగ్రవాద సంస్థల అధిపతులు దాక్కున్న ప్రదేశాలు ధ్వంసమయ్యాయి. మొత్తం 80 నుంచి 100మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో మూడు ఉగ్రవాద సంస్థలకు ఎంత నష్టం వాటిళ్లిందో తెలుసుకుందాం.
హఫీజ్ సయీద్..
లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుంచుకోట మురిడ్కే, షావాయి నల్లా ( పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో లష్కరే తోయిబాకు ఒక ప్రధాన శిబిరం). మరియు మర్కజ్ అహ్లే హదీస్ (బరణాల) ప్రాంతాల్లోని స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. మురిడ్కేలో ఉన్న శిబిరాన్ని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం అని కూడా పిలుస్తారు. ఉగ్రవాదులు శిక్షణ పొందినది ఇక్కడే. ఈ రహస్య స్థావరం అంతర్జాతీయ సరిహద్దు నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బర్నాలా., షావాయి నల్లాలోని రహస్య స్థావరాలలో ఉగ్రవాదులకు ఆయుధాలు, ఐఈడిలలో శిక్షణ ఇవ్వబడింది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో భారతసైన్యం మెరుపుదాడులు చేయడంతో భారీ నష్టం వాటిళ్లింది.
మసూద్ అజార్ ..
భారత సైన్యం చేసిన మెరుపుదాడులతో అతిపెద్ద దెబ్బ జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు తగిలింది. బహవల్ పూర్ లో ఆ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. సర్జల్, బిలాల్ క్యాంప్, కోట్లిలోని లాంచ్ ప్యాడ్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. బహవల్ పూర్ జైషే కు అతిపెద్ద ఆపరేషన్ హబ్. బహవల్‌పూర్‌లోని కేంద్రం అంతర్జాతీయ సరిహద్దు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు ఆపరేషన్ సిందూర్‌లో మరణించారు. మసూద్ అజార్ అక్క, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, ఇతర మేనల్లుళ్ళు, ఆ కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు మరణించారు. ఈ దాడిలో మసూద్ అజార్ సన్నిహితుడు, అతని తల్లి, మరో ఇద్దరు సన్నిహితులు కూడా మరణించారు. దాడిలో తన కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత మసూద్ అజార్ తీవ్రంగా ఏడ్చినట్లు తెలిసింది.
సయ్యద్ సలావుద్దీన్ ..
భారత సైన్యం మెరుపు దాడులతో ఉగ్రవాది ఖారీ మహ్మద్ ఇక్బాల్ కూడా మరణించాడు. కోట్లిలోని ఉగ్రవాద శిబిరాన్ని ఖారీ ఇక్బాల్ నడిపేవాడు. ఖారీ ఇక్బాల్‌తో పాటు, 10 మంది ఉగ్రవాదులు కూడా మరణించారు. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ రహస్య స్థావరాలపై కూడా వైమానిక దాడులు జరిగాయి. కోట్లి, మెహమూనా జోయా (సియాల్‌కోట్), రహిల్ షాహిద్ క్యాంప్ ధ్వంసం అయ్యాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కు తలదాచుకునే చాలా స్థావరాలు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.